గాంధీలా బతుకుతున్న నన్నంటాడా? | Sakshi
Sakshi News home page

గాంధీలా బతుకుతున్న నన్నంటాడా?

Published Mon, Feb 11 2019 4:10 AM

Chandrababu Fires on Narendra Modi - Sakshi

సాక్షి, విజయవాడ:  గాంధీలా చాలా సాధారణ జీవితం గడుపుతున్న తనపై ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి ఆరోపణలు చేస్తారా? అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ  రోజూ రూ. కోట్ల విలువైన సూటు బూట్లు వేసుకుంటారని, తాను మాత్రం మహాత్మాగాంధీలా చాలా సాదాసీదాగా ఉంటానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆదివారం ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.. ‘40 ఏళ్లుగా ఒకేరకం బట్టలు వేసుకుంటున్నాను. ఎక్కడకు వెళ్లినా వేషం మార్చడం లేదు. సూట్లు వేసుకోవడం లేదు. ఈ రోజు ప్రజల కోసం నల్ల చొక్కా వేసుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. గుంటూరు సభలో ప్రధాని మోదీ చేసిన విమర్శలపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. రాజకీయ గురువుకు పంగనామాలు పెట్టిన ప్రధాని మోదీ.. తనను సొంతమామకు వెన్ను పోటు పొడిచానని విమర్శించడం సరికాదని అన్నారు. మోదీకి రాజకీయ ఎదుగుదలకు సాయపడింది ఎల్‌కే అద్వానీ అని, గోద్రా అల్లర్ల అనంతరం మోదీని ముఖ్యమంత్రిగా తప్పించాలని వాజ్‌పేయ్‌ ప్రతిపాదించగా.. అద్వానీయే కాపాడారని బాబు పేర్కొన్నారు. చివరకు గురువుకే మోదీ పంగనామాలు పెట్టారని ఎద్దేవా చేశారు. మోదీ ప్రధాని అయ్యేందుకు అద్వానీ సహకరిస్తే ఆయనకు కనీసం ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం లేని వ్యక్తి అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. సీనియర్లను గౌరవించడం చేతకాని, గురువుకు పంగనామాలు పెట్టిన వ్యక్తా నా గురించి మాట్లాడేది! అని మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అమరావతిని చూసే అసూయ
అమరావతి అభివృద్ధిని చూసి నరేంద్రమోదీ అసూయపడి ఉంటారని, కేంద్రం ఏ సాయం చేయకపోయిన అభివృద్ధి చెందుతోందని బాధపడుతున్నారని చంద్రబాబు అన్నారు. ‘గుజరాత్‌ను ఆంధ్రప్రదేశ్‌ మించిపోతుందని మీకు అసూయ ఉండొచ్చు. మాకు డబ్బులు ఇవ్వమని కోరితే  నేను లెక్కలు చెప్పలేదంటున్నారు. నేను లెక్కలు చెప్పను.. మా సీఐజీ మాత్రమే చెబుతుంది’ అని మోదీపై విమర్శలు కొనసాగించారు.  మోదీ ఎంత మాట్లాడినా అదే స్థాయిలో తిప్పి కొట్టేశక్తి తమకు ఉందని, ఢిల్లీ వచ్చి ప్రశ్నిస్తానని.. దేశ ప్రజల ముందు ప్రధాని నరేంద్రమోదీని దోషిగా నిలబెడతానని చంద్రబాబు హెచ్చరించారు. మోదీని ఇంటికి పంపి రాష్ట్ర హక్కులు సాధించుకునే వరకు పోరాడతానని చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం తల్లిని చంపి బిడ్డను కాపాడారంటూ కాంగ్రెస్‌ను మోదీ విమర్శించారని.. ఇప్పుడు తల్లిని మోదీ దగా చేశారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. నా తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన నరేంద్రమోదీని సార్‌..సార్‌! అన్నానని, ప్రధానమంత్రి పదవిలో ఉన్నందుకే గౌరవించానని చెప్పుకొచ్చారు. రాజధాని శంకుస్థాపనకు పిలిస్తే పార్లమెంట్‌ నుంచి మట్టి, నీళ్లు తెచ్చి మన ముఖంపై కొట్టారని విమర్శించారు.
 
కుటుంబవ్యవస్థపై గౌరవం ఉందా?
లోకేష్‌ తండ్రి చంద్రబాబు అని మోదీ అభివర్ణించడాన్ని సీఎం తప్పుపట్టారు. ‘నీకు అబ్బాయిలు లేరు.. కుటుంబం లేదు.. సంబంధాలు, బంధాల్ని తెంచే  వ్యక్తివి నువ్వు. నీకు కుటుంబ వ్యవస్థపై గౌరవం ఉందా?’  అని చంద్రబాబు ప్రశ్నించారు. భార్య యశోదాబెన్‌ను దూరంగా పెట్టిన మీరా మాట్లాడేది..? ఆమెకు  విడాకులు కూడా ఇవ్వలేదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువింద సామెతను నరేంద్రమోదీ గుర్తుంచుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని కుటుంబాలకు తాను పెద్దగా ఉన్నందుకు గర్వపడుతున్నానని చెప్పారు. లోకేష్‌కు తండ్రిగా, దేవాన్ష్కు తాతగా, భువనేశ్వరికి భర్తగా ఉన్నందుకు గర్వపడుతున్నానే తప్ప బాధపడటం లేదని, నా రాజకీయాలపై నా కుటుంబసభ్యులెవరూ ఆధారపడిలేరని, ఆధారపడరని అన్నారు.

నోట్ల రద్దు తుగ్గక్‌ చర్య
ఈ ప్రధానిది ప్రచారయావని, చేతల మనిషి కాదని బాబు తప్పుపట్టారు. నోట్ల రద్దు వల్ల ఎవరైనా లాభపడ్డారా? అది పిచ్చి తుగ్లక్‌ చర్య అని చంద్రబాబు అభివర్ణించారు. జీఎస్టీతో చాలా మంది ఇబ్బంది పడ్డారని, మోదీ హయాంలో బ్యాంకులు దివాలా తీశాయని, కొందరు దేశ సంపద దోచుకుని విదేశాలకు పారిపోతే, మోదీ ప్రభుత్వం గమ్మున కూర్చుందని, మోదీ విధానాలతో ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని విమర్శించారు. సమావేశంలో జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, జలీల్‌ఖాన్, జడ్పీ చైర్మన్‌ గద్దె అనూరాధ తదితరులు పాల్గొన్నారు. 

ఏపీపై యుద్ధానికి మోదీ వస్తున్నారు
సాక్షి, అమరావతి : ఏపీపై యుద్ధానికి నరేంద్ర మోదీ వస్తున్నారని ఆదివారం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి మోదీ అన్యాయం చేశారని, వ్యవస్థల్ని మోదీ నాశనం చేశారని విమర్శించారు. మోదీపై అస్సాం, పశ్చిమబెంగాల్, తమిళనాడులో నిరసనలు వ్యక్తమవుతున్నాయని, ఈశాన్య రాష్ట్రాలు బీజేపీపై ఆగ్రహంగా ఉన్నాయని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలు కూడా మోదీ అంటే మండిపడుతున్నాయన్నారు. రాష్ట్రానికి చేసిన అన్యాయంపై నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ర్యాలీల్లో రెండు కుండలు పగులకొట్టాలని, ఒకటి నరేంద్రమోదీ, ఇంకోటి జగన్‌మోహన్‌ రెడ్డికి సంకేతమని, రెండు కుండలు రెండు పార్టీల లాలూచీకి సంకేతమని అన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement