‘నాలుగేళ్లలో 4 కోట్ల ఉద్యోగాలు కల్పించాం’

Central MSME Minister Giriraj Singh Attacked Congress Over The Job Creation - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 30 వేల రూపాయల పిజ్జా తినే వారికి నెలకు 12 వేల రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగం ఉద్యోగంలా కనిపించదు అంటూ కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వివాదాస్పత వ్యాఖ్యలు చేశారు. సబర్మతి నది తీరాన ఉన్న పార్క్‌లో ‘ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ కమిషన్‌’ వారి అధ్వర్యంలో  ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి గిరిరాజ్‌ సింగ్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. ‘ఈ నాలుగేళ్ల పాలనలో మేము 4 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చాము. వారిలో దాదాపు 70శాతం మంది నెల జీతం 12 వేల రూపాయలు. ప్రస్తుతం ప్రపంచం నైపుణ్యాలు కలిగిన యువత కోసం చూస్తుంది. మన దేశంలో నైపుణ్యం ఉన్న యువత కేవలం 5 శాతం మాత్రమే. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతే దేశంలో నైపుణ్యాభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారు. నైపుణ్య శిక్షణ గురించి తొలిసారి బీజేపీ ప్రభుత్వమే మాట్లాడింది. 30 వేల రూపాయల విలువ చేసే పిజ్జా తినే వారికి నెలకు 12 వేల రూపాయల జీతం లభించే ఉద్యోగం ఉద్యోగంలా కనిపించకపోవడంలో వింతేముంది’ అన్నారు.

‘ముద్రా’ పథకం కింద తమ మంత్రిత్వ శాఖ 10 కోట్ల మందికి ఉపాధి కల్పించిందన్నారు. 2010 - 2014 మధ్య కాలంలో యూపీఏ హయాంలో 11 లక్షల మంది నూతన పారిశ్రామిక వేత్తలు ఉంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 లక్షల మంది నూతన పారిశ్రామిక వేత్తలను తయారుచేశామని తెలిపారు. టెక్స్‌టైల్‌, హస్త కళల పరిశ్రమలను మినహాయించి ఇంతమంది పారిశ్రామికవేత్తలను తయారు చేసామన్నారు. ఇక ఆ రెండు శాఖలను కూడా కలుపుకుంటే వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

మహాత్మగాంధీ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఆయన విధానాలను ఖూనీ చేసిందని గిరిరాజ్‌ సింగ్‌ విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతే దేశవ్యాప్తంగా చరఖా గురించి మాట్లాడుకునే పరిస్థితులు వచ్చాయన్నారు. సబర్మాతి నదీ తీరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్‌ షా స్టీల్‌ చరఖాను ఆవిష్కరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top