సోమవారమే మంత్రిమండలి? 

BS Yeddyurappa May Take Cabinet On Monday - Sakshi

నేడు అమిత్‌షాతో సీఎం యడ్డి చర్చలు

సాక్షి, బెంగళూరు: కొత్త ప్రభుత్వం ఏర్పాటై 20 రోజులు దాటినా మంత్రివర్గం జాడలేదని విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఎం యడియూరప్ప వచ్చే సోమవారం 18 – 20 మంది తో మంత్రిమండలి ఏర్పాటుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆయన శనివారం ఢిల్లీ యాత్రలో పార్టీ చీఫ్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమై మంత్రివర్గం ఏర్పాటు గురించి చర్చించనున్నారు. అన్ని వర్గాలకూ పెద్దపీట వేసేలా లింగాయత్‌ 5, ఒక్కళిగ 4, ఎస్సీ 3, ఎస్టీ 3, కురుబ, బ్రాహ్మణ, బిల్లవ కులాలకు ఒక్కొక్కటి చొప్పున మంత్రిపదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది.
 
బలమైన నేతలకే చాన్స్‌  
మంత్రివర్గంలో ఎవరికి చోటు ఇవ్వాలనే దానిపై ఢిల్లీ నుంచి డైరెక్షన్‌ చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. వారి ఆదేశాల మేరకు యడియూరప్ప తరచూ జాబితా సవరించి తీసుకెళ్తున్నారు. శని, ఆదివారాల్లో జాబితాను ఖరారు చేసే అవకాశముంది. ప్రతిపక్షంలో కుమారస్వామి, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ వంటి సీనియర్‌ నేతలు ఉన్నందున వారిని ఢీకొనగలిగే నాయకుకే కేబినెట్‌లో చోటు దక్కుతుందని సమాచారం. తొలి విడతలో 20 మందికి పోస్టు లు కల్పించినా, ఇంకా 13 ఖాళీగా ఉంటాయి. అనర్హత ఎమ్మెల్యేలకు అవకాశం కోసం వాటిని కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. 

తొలివిడతలో వీరికేనా?  
గోవింద కారజోళ, కేఎస్‌ ఈశ్వరప్ప, ఆర్‌.అశోక్, జగదీశ్‌ శెట్టర్, వి.సోమణ్ణ, జేసీ మాధుస్వామి, బి.శ్రీరాములు, ఉమేశ్‌ కత్తి, డాక్టర్‌ అశ్వర్థనారా యణ్, శశికళా జొల్లె, రేణుకాచార్య, సీటీ రవి, బాలచంద్ర జార్కిహోళి, శివనేగౌడనాయక్, అంగార, బోపయ్య, కోటా శ్రీనివాసపూజారి, జి.కరుణాకర్‌రెడ్డి తదితరులకు తొలివిడతలో మంత్రులుగా అవకాశం ఇస్తారని సమాచారం.   
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top