
పత్రికా సమావేశంలో ఉద్వేగానికి గురైన శశీల్
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ పార్టీల తరపున ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలో భాగం అవుదామనుకునే నేతలకు కొదవే ఉండదు. వచ్చే నెలలో కర్ణాటకలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని టికెట్ ఆశించేవారి సంఖ్య కూడా భారీగానే ఉంది. టికెట్ ఆశించి భంగపడ్డ వారు బాహాటంగానే తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. పత్రికా సమావేశాల్లో ఆయా పార్టీలపై తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీ ప్రకటించిన రెండో జాబితాలో కూడా తనకు సీటు కేటాయించకపోవడంతో ఓ బీజేపీ నేత విలేకరుల సమావేశంలో బోరుమన్నాడు. పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక మధ్యలోనే వెళ్లిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. 12 ఏళ్లపాటు ఎమ్మెల్సీగా, గుల్బార్గా నగర డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన బీజేపీ నేత శశీల్ జీ నామోషీ తొలుత ‘గుల్బార్గా దక్షిణ్’ అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే బీజేపీ ఆ సీటుని దత్తాత్రేయ పాటిల్ రేవూర్‌కు కేటాయించింది. పార్టీ ప్రకటించే రెండో జాబితాలోనైనా తనకు టికెట్ లభిస్తుందని ధీమాగా ఉన్న శశీల్ తన అనుచరగణంతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. ‘గుల్బార్గా ఉత్తర్’ టికెట్‌ను ఇస్తారని అనుకున్నారు. కానీ, ఆయనకు రెండో జాబితాలోనూ నిరాశే మిగిలింది. సోమవారం విడుదలైన రెండో జాబితాలో బీజేపీ ఆ స్థానాన్ని సీబీ పాటిల్‌కు కేటాయించింది.
దాంతో శశీల్ తీవ్ర మనస్థాపం చెందారు. తన ఆవేదనను వెళ్లగక్కేందుకు పత్రికా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతుండగానే.. దుఃఖం పొంగుకురావడంతో కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడే ఉన్న తన సహచరులు, పాత్రికేయులు ఆయనను సముదాయించి అర్థాంతరంగా సమావేశాన్ని ముగించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, శశీల్ జేడీఎస్ (జనతాదళ్-సెక్యులర్) తరపున 2013 లో గుల్బార్గా దక్షిణ్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.