'కేసీఆర్‌ చర్యల వల్ల రాష్ట్రం దివాలా తీస్తుంది'

BJP Leader Laxman Fires On KCR And Rahul Gandhi In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌ : మోదీ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక కఠిన నిర్ణయాలు తీసుకుంటుంటే రాష్ట్రంలో మాత్రం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక అశాంతి, అసంతృప్తి నెలకొన్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ వెల్లడించారు. పోలీసుస్టేషన్‌లో ఉండాల్సిన పోలీసులు బస్‌ డిపోలు, రెవెన్యూ కార్యాలయాల ముందు ఉంటున్నారని ఆరోపించారు. బస్సుల్లో తిరగాల్సిన డ్రైవర్‌, కండక్టర్‌ చౌరస్తాల్లో ఆందోళన నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికు బలిదానాలతో తెలంగాణ ఆత్మహత్యల రాష్ట్రంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులపై భుజంపై తుపాకీ పెట్టి ఆర్టీసీ కార్మికులను కాల్చివేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యల వల్ల రాష్ట్రం పూర్తిగా దివాళా తీస్తుందని, సంక్షేమ కార్యక్రమాలు అటకెక్కుతున్నాయని దుయ్యబట్టారు. మీకు దమ్ముంటే ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసి పీఆర్‌సీని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 41 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా పట్టించుకోని కేసీఆర్‌ రెవెన్యూ ఉద్యోగులు ఎక్కడ వారికి మద్దతు తెలుపుతారో అని భయపడి వారితో చర్చలు జరపడం విడ్డూరంగా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రసుత్త పరిస్థితుల్లో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయంగా భావిస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఆదివాసీ నేత తాటి కృష్ణ లక్ష్మన్‌ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.

రాహుల్‌ గాంధీ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది
రాఫెల్‌పై  రాహుల్‌ గాంధీ చేస్తున్న ఆరోపణలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని  లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాఫెల్‌ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు గుర్తుచేశారు. రాహుల్‌గాంధీ తన కాళ్లకు బలపం కట్టుకొని తిరిగి బీజేపీ నేతలపై బురద జల్లే ప్రయత్నాన్ని ప్రజలు తిరస్కరించారని తెలిపారు. ఇప్పటికైనా రాహుల్‌గాంధీ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని, తన కుటిల బుద్దిని మానుకోవాలని పేర్కొన్నారు. ఎంతటి జఠిల సమస్యలనైనా మోదీ సామరస్యంగా పరిష్కరిస్తున్నారని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top