
ఈ డబ్బంతా చంద్రబాబు ఏం చేశారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్
విజయవాడ: ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఊసరవెల్లిలా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి కోసూరి వెంకట్ విమర్శించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా రాజధానికి ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1500 కోట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు 56 లక్షల ఇటుకలను అమ్మారని చెప్పారు. దాదాపు రూ.2 వేల కోట్ల విలువ చేసే బాండ్లు కూడా అమ్మిన సంగతిని వివరించారు.
ఈ డబ్బంతా చంద్రబాబు ఏం చేశారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల నుంచి వేల ఎకరాల భూములు బలవంతంగా లాక్కున్నారని, ఆ భూములతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో దోచేసిన సొమ్మును తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు పెడుతూ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు నీతి నిజాయతీపరుడే అయితే, దమ్ముంటే వీటిపైన శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.