
సాక్షి, కొత్తగూడెం: రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, డబ్బుకు అమ్ముడుపోయి పార్టీలు మారిన ఎమ్మెల్యేలను శిక్షించాలని, ఎమ్మెల్యేలపై 420 కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర బుధవారం కొత్తగూడెం చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక సూపర్‌బజార్ సెంటర్‌లో జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పార్టీ మారనని ప్రమాణం చేసి, కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి గెలిచారని, ఇప్పుడు డబ్బుకు అమ్ముడుపోయి పార్టీ మారుతున్నారని విమర్శించారు. వనమా తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అక్రమాలను బట్టబయలు చేసేందుకే ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తున్నామని చెప్పారు. ఇంటర్ ఫలితాల అవకతవక లపై న్యాయ విచారణ చేపట్టిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే పోట్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
భట్టికి వడదెబ్బ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: భట్టి విక్రమార్క బుధవారం రాత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో భాగంగా నాలుగు రోజులుగా ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో సుజాతనగర్‌లో బుధవారం యాత్ర నిర్వహించిన అనంతరం ఆయన వడదెబ్బకు గురయ్యారు. అక్కడ నుంచి ఖమ్మం చేరుకున్న భట్టి అస్వస్థతకు గురికావడంతో పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు ఆయనను ఖమ్మంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎండదెబ్బ తగలడంతో డీహైడ్రేషన్‌కు గురయ్యారని వైద్యులు తెలిపారు.