
పార్లమెంట్ బయటకు వస్తున్న మంత్రి హర్షవర్ధన్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కేంద్రమంత్రి హర్షవర్థన్ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలు బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు కొట్టుకునే దాకా వెళ్లాయి. అసభ్యకరమైన రాహుల్ వ్యాఖ్యలను ఖండించేందుకు మాటలు చాలవంటూ కేంద్రమంత్రి హర్షవర్థన్ వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ సభ్యుడు మాణిక్యం మంత్రిపై దాడి చేయబోయారు. అనంతరం రెండు పార్టీల సభ్యుల నిరసనల మధ్య సభ శనివారానికి వాయిదాపడింది. శుక్రవారం ఉదయం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యుడు రాహుల్ గాంధీ దేశంలో వైద్యకళాశాలల ఏర్పాటుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సమాధానం ఇవ్వాల్సిన ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్..ముందుగా గురువారం ఢిల్లీ ఎన్నికల ర్యాలీలో రాహుల్ ‘ఆరు నెలల తర్వాత నిరుద్యోగ యువత ప్రధాని మోదీని కర్రలతో కొట్టి దేశం నుంచి తరిమేస్తారు’ అంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఇటువంటి అసభ్యకర వ్యాఖ్యలను ఖండించేందుకు మాటలు చాలవని పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళనాడుకు చెందిన మాణిక్యం ఠాగూర్ అధికార పక్షం వైపు దూసుకువచ్చారు. మంత్రిపై దాడి చేసేందుకు ఆయన యత్నించగా పలువురు అడ్డుకున్నారు. అనంతరం కాంగ్రెస్, బీజేపీ సభ్యుల నిరసనలతో సభ పలుమార్లు వాయిదా పడింది.