చంద్రబాబు బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారు: జూపూడి

AP Political Parties Meeting With CEC Sunil Arora In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఎన్నికల కుట్రలన్నింటినీ ఈసీ దృష్టికి తీసుకెళ్లామని వైఎస్సార్‌ సీపీ నేత పార్థసారథి తెలిపారు. సోమవారం ఏపీ రాజకీయ పక్షాలతో కేంద్ర ఎన్నికల కమీషనర్ సునీల్ అరోరా భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి, బీజేపీ నేత జూపూడి రంగరాజు, సీపీఐ నేత జల్లి విల్సన్, సీపీఎం నేత వై వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నేత తాంతియా కుమారి, టీడీపీ నేత పట్టాభి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. టీడీపీ ఎన్నికల అక్రమాల గురించి ఎన్నికల అధికారి సునీల్‌ అరోరాకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ యంత్రాంగాలను దుర్వినియోగం చేసి, రిగ్గింగ్ చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 59 లక్షల డూప్లికేట్‌ ఓటర్లు ఉన్నారని తెలిపారు.

దీనిపై ఫిర్యాదు చేసినా.. ప్రభుత్వం ఆ ఓటర్లను తొలగించకుండా అధికారులను బెదిరిస్తున్నారని చెప్పారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా ఓటర్ల జాబితాలో అవకతవకలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు. సర్వేల పేరుతో ట్యాబ్‌లు ఇచ్చి, ప్రత్యేకమైన యాప్ సృష్టించి ఓటర్లను తొలగిస్తున్నారన్నారు. ట్యాబ్‌లలో ఓటర్ల జాబితాలను పెట్టి.. ఓట్లను తొలగిస్తున్న విషయాన్ని స్వయంగా ఆధారాలతో వివరించామన్నారు. కానూరు బూత్ నెంబర్ 1లో ఆదినారాయణ అనే వ్యక్తికి ఏడు ఓట్లున్నాయని వెల్లడించారు. ఇలాంటి ఉదాహరణలతో ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. బూత్‌లను స్వాధీనపరుచుకోవడానికి నచ్చిన పోలీసు అధికారులను నియమించుకుంటున్నారని తెలిపారు. నాన్ క్యాడర్ అధికారులను జిల్లా ఎస్పీలుగా నియమిస్తున్నారన్నారు.

చంద్రబాబు బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారు: జూపూడి రంగరాజు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని బీజేపీ నేత జూపూడి రంగరాజు తెలిపారు. సోమవారం కేంద్ర ఎన్నికల కమీషనర్ సునీల్ అరోరాతో భేటీ అయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో శాంతి, భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా వుందన్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఇంటిపై దాడి చేస్తే.. కనీసం కేసు కూడా నమోదు చేయట్లేదంటూ వాపోయారు. ఎన్నికలకు ముందు అధికారులను బదిలీలు చేస్తున్నారని, వాటిపై ఫిర్యాదు చేసామని తెలిపారు. డీజీపీ ఠాకూర్‌కి తాము ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా చర్యలు తీసుకోలేదన్నారు. ఆయనపై కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కుల విషయంపై కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఎన్నికల సమయంలో ఇలా చేయడంపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఓటర్లను మభ్యపెట్టే చర్య కాబట్టి.. దీనిపై ఫిర్యాదు చేశామని, ఈ చెక్కుల వ్యవహారంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామన్నారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top