తిరుమల కొండకి పద చిత్రాల పూజ | Word to the Tirumala hill to worship images | Sakshi
Sakshi News home page

తిరుమల కొండకి పద చిత్రాల పూజ

Nov 8 2015 12:21 AM | Updated on Aug 28 2018 5:54 PM

తిరుమల కొండకి పద చిత్రాల పూజ - Sakshi

తిరుమల కొండకి పద చిత్రాల పూజ

సీనియర్ జర్నలిస్టు పున్నా కృష్ణమూర్తి ‘తిరుమల కొండ పద చిత్రాలు’గా అందించిన అపురూపమైన పుస్తకం తిరుమలసాయికి ‘తొలి

సీనియర్ జర్నలిస్టు పున్నా కృష్ణమూర్తి ‘తిరుమల కొండ పద చిత్రాలు’గా అందించిన అపురూపమైన పుస్తకం తిరుమలసాయికి ‘తొలి వందనము’ సమర్పిస్తూ మొదలవుతుంది. నిండుగా పూచిన మల్లెపొద లాంటి ఈ పుస్తకంలో ఎన్నెన్నో పరిమళభరిత విషయాలు!
 తిరుమలకొండ తొలి పేరు ‘వేంగడం’. 8వ శతాబ్దం దాకా వచ్చిన తమిళ సాహిత్యంలో కొండ మీద దేవుడు గురించి ఎవరూ నిర్దిష్టంగా చెప్పలేదు. వేట ప్రధానంగా జీవించిన గిరిజనులు ‘వేంగళాంబ’ అనే స్త్రీ దేవతను కొలిచి జాతరలు చేసుకునే వారని ప్రస్తావనలు ఉన్నాయి. దేవీ భాగవతం ‘వేంకటేశ్వరి’ అంది. స్కంధ, మార్కండేయ పురాణాలు చూపించి శైవులు ‘కుమారస్వామి’ అన్నారు. చివరికి రామానుజుడు విష్ణు అవతారమైన ‘వేంకటేశ్వరు’డని అందర్నీ ఒప్పించాడు. అందుకే అన్నమయ్య ‘ఎంత మాత్రమున ఎవ్వరు కొలిచిన అంత మాత్రమే నీవు’ అని తీర్పు చెప్పాడు. వేంగడం, వేంకటం, వెంకటగిరి అయింది.

 వేంకటేశ్వరుని తమ స్వామిగా చేసుకుని, వైష్ణవ గురువులు 12 మంది ఆళ్వారులు ‘పాశురా’లతో స్వామిని కీర్తించారు. ఆళ్వారులలో బ్రాహ్మలే కాకుండా  క్షత్రియులు, శూద్రులు, పంచములు, ఓ స్త్రీ కూడా ఉన్నారు.

 భారతదేశంలో పరాయి పాలకుల దండయాత్ర జరగని ప్రముఖ ఆలయం తిరుమల ఒక్కటే. కొండలయ్య కోసం జుట్టు పెంచుకొని, బీబీ నాంచారమ్మ కోసం తలనీలాలు యిస్తారన్న కథ హైదర్ అలీని కొండపై దండెత్తకుండా చేసింది. ఆర్కాట్ నవాబుల దగ్గరి నుంచి ప్రతి ఒక్కరూ కొండపై శాంతినే కోరుకున్నారు. అక్కడ పవిత్రత దెబ్బతింటే భక్తులు రారు. హుండీ నిండదు. ఫలితంగా తిరుమలలో పన్నులు ప్రవేశించాయి. పెళ్లి కోసం వేంకటేశ్వరుడు అప్పులు చేశాడనే కథలు పుట్టాయి. నిలువు దోపిడీ మొక్కులు ప్రవేశించాయి.

 కంచి రాజధానిగా పాలించిన పల్లవ రాజవంశీకురాలు సామవాయి సమకూర్చిన నిధులతో 966 ఆగస్టు 30న మొదటి బ్రహ్మోత్సవం జరిగింది. 14వ శతాబ్దం వరకు బ్రహ్మోత్సవాలు తప్ప, యితర ఉత్సవాలు లేని తిరుమలలో 17వ శతాబ్దానికి 429 పండగలొచ్చి చేరి ‘నిత్య కల్యాణం పచ్చ తోరణం’ అయింది. పద్మశాలీల ఆడపడుచు పద్మావతీ దేవి 12వ శతాబ్దంలోనే అస్తిత్వంలోకి వచ్చింది. 29 శ్లోకాలతో కూడిన సుప్రభాతాన్ని ప్రతివాది భయంకర అన్నన్ 1430లో రాశారు.

 ఇలా తిరుమలతో అనుబంధం ఉన్న వ్యక్తులు, నమ్మకాలు, తీర్థాలు, చారిత్రకాంశాలను 2002లో వచ్చిన ఈ పుస్తకం చక్కగా వివరిస్తుంది. స్వయంగా ఫొటోగ్రాఫర్ కూడా అయిన పున్నా కృష్ణమూర్తి(ఫోన్: 7680950863) ప్రతీ పేజీని ఒక చక్కటి ఫొటోతో ప్రెజెంట్ చేయడం వల్ల పుస్తకం అందం పెరిగింది.
కృష్ణమోహన్ బాబు 9848023384

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement