
‘జన ధన యోజన’ నెరవేరేనా?
దేశంలో చాలా మందికి మొబైల్ ఫోన్లు ఉన్నప్పటికీ, బ్యాంక్ ఖాతాలు లేకపోవడం శోచనీయమని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.
ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా ఆర్థిక అవకాశాలు కల్పించకుంటే ఇంటింటికీ బ్యాంకు ఖాతాలు ఇచ్చినా నిష్ర్పయోజనమే. కాని ఈ దిశగా తామేం చేస్తామనే అంశంపై మోడీ ప్రభుత్వం సూచనప్రాయంగా కూడా తెలపడం లేదు.
దేశంలో చాలా మందికి మొబైల్ ఫోన్లు ఉన్నప్పటికీ, బ్యాంక్ ఖాతాలు లేకపోవడం శోచనీయమని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ దుస్థితిని మార్చడానికి ‘ప్రధానమంత్రి జన ధన యోజన’ పేరిట ఒక కొత్త పథకం ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం సైతం ఇలాంటి ప్రయత్నాలకే పూను కుని విఫలమైన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పరిగ ణనలోకి తీసుకోలేదు.
అమల్లో ఉన్న పథకాలు ఎందుకు విఫలం అవుతున్నాయో విశ్లేషించుకోకుండా కొత్త పథకాలు ప్రవేశ పెట్టడం ద్వారా సాధించేదేమీ ఉండదు. వాస్తవానికి మన దేశ జనాభాలో 65 శాతం మందికి కనీసం ఒక్క బ్యాం కు ఖాతా కూడా లేదు. అమెరికాలోని వయోజనుల్లో 88 శాతం మందికి బ్యాంకు ఖాతాలు ఉండగా, చైనాలో 63.8 శాతం, బ్రెజిల్‌లో 55.9 శాతం, దక్షిణాఫ్రికాలో 53.6 శాతం, రష్యాలో 48.2 శాతం మందికి అందుబాటులో ఉన్నాయి. అది మనదేశంలో మాత్రం కేవలం 35.2 శాతం మాత్రమే. అందుకనే దేశంలోని వయోజనులందరికీ బ్యాంక్ ఖాతాను కల్పించనున్నట్లు మోడీ తెలిపారు. అయితే ఉద్దేశాలు ఎంత మంచివైనా గత ప్రభుత్వ అనుభవాలను కనీసం పరిశీలించ కుండా కొత్త పథకం అమలుకు సిద్ధమవుతున్నారు.
దేశంలోని 7.5 కోట్ల కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి 2018 ఆగస్టు నాటికి కనీసం రెండు బ్యాంక్ ఖాతాలను అందిస్తామన్నారు. ఈ పథకం కింద ఒక్కో బ్యాంక్ ఖాతాకు రూ.5 వేల ఓవర్ డ్రాఫ్ట్ (ఖాతాలో నగదు నిల్వకు మించి అదనంగా రూ.5 వేల వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం) కల్పిస్తారు. ప్రతి కస్టమర్‌కూ ఒక ‘రూ పే డెబిట్ కార్డ్’, లక్ష రూపాయల ప్రమాద బీమా కవరేజ్ లభిస్తుంది.
పైకి ఎంత ఆసక్తికరంగా ఉన్నప్పటికీ బ్యాంకింగ్ వ్యవ స్థను మెరుగుపర్చకుండా ఈ పథకం ఫలితాలను సాధిం చడం కల్లే. సాంప్రదాయిక బ్యాంకింగ్ విధానం దేశప్రజలకు ఆర్థిక ఫలాలను అందజేయడంలో విఫలమైందని ఆర్బీఐ 2006లో నిర్ధారణకు వచ్చింది. దీంతో అది ‘బిజినెస్ కర స్పాండెంట్’ అనే మధ్యంతర ఉద్యోగులను నియమించుకో వడానికి బ్యాంకులకు అనుమతినిచ్చింది. గ్రామీణ ప్రాంతా ల్లోని ప్రజలకు బ్యాంకు ఖాతాలు, డిపాజిట్లు తెరవడం, విత్‌డ్రా చేసుకోవడంలో సాయపడటం, కొన్ని రకాల రుణాలకు అర్హులైన వారిని గుర్తించడం వారి విధులు.
గత ఎనిమిదేళ్లలో 2.2 లక్షల మంది ‘బిజినెస్ కరస్పాండెంట్లు’, మైక్రోఫైనాన్స్ సంస్థలు, పీసీఓ ఫోన్ ఆపరేటర్లు, చిల్లర దుకాణాల యజమానులు ఈ విధానం కింద వివిధ బ్యాం కులకు ఏజెంట్లుగా వ్యవహరించారు. 2012 మార్చి నాటికి ఈ కొత్త విధానం కింద మన బ్యాంకులు 74,199 గ్రామా లను కవర్ చేశాయి. అంటే తాము విధించుకున్న లక్ష్యంలో 99.7 శాతాన్ని చేరుకున్నాయని ఒక అధ్యయనం పేర్కొంది. అయితే ఏజెంట్లు సమర్థంగా పనిచేయలేదని బ్యాంకులు, తమకు లాభసాటిగా వేతనం అందించలేదని ‘బిజినెస్ కరస్పాండెంట్’లు, పరస్పరం ఆరోపించుకోవడంతో ఈ పథకం నీరుగారిపోయింది.
మొబైల్ వ్యాన్ ఏటీఎమ్‌లు మొదట్లో కొన్నాళ్లు ఆర్భాటంగా నడిచినా లావాదేవీలను పెంచడంలో వాటి పాత్ర శూన్యమే. మోడీ ప్రభుత్వం ఇప్పుడు బ్యాంకు ఏజెంట్లకు రూ.5 వేలను కనీస వేతనంగా నిర్ణయించి, బ్యాంక్ కస్టమర్లు మరిన్ని లావాదేవీలు నిర్వహించేలా ప్రోత్సహించడానికి ‘జన ధన యోజన’ పథకాన్ని తీసుకువస్తోంది. కానీ, బ్యాంక్ ఖాతాలోంచి రూ.5 వేలను అదనంగా డ్రా చేసుకున్నంత మాత్రాన గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒరిగేదేమీ లేదు. లక్ష రూపాయిల ప్రమాద బీమావల్ల ప్రయోజనం చాలా స్వల్పమే. కారణం.. ప్రమాదాలకు గురై మరణించేవారి సంఖ్య తక్కువ.
2006లో కొత్త విధానంతో బ్యాంక్ ఖాతాలు పెరిగినప్ప టికీ, వాటిలో చాలావరకు ప్రభుత్వ సబ్సిడీలను నగదు రూ పంలో అందించడం వరకే పరిమితమయ్యాయి. కొత్తగా తెరి చిన ఖాతాల్లో 80 శాతం నిష్క్రియాత్మకంగా మారాయి. కార ణం స్పష్టమే. దేశంలో జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు వ్యవసాయ రుణాలపై మొహం చాటేశాయి. లీడ్ బ్యాంకులు కూడా పంట రుణాలకు మాత్రమే ఆమోదం తెలుపుతున్నాయి. దీంతో గ్రామీణులు తమ ఆర్థిక అవస రాల కోసం సాంప్రదాయిక వడ్డీ వ్యాపారులనే ఆశ్రయిం చాల్సి వచ్చింది.
ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా ఆర్థిక అవకాశాలు కల్పించకుంటే ఇంటింటికీ బ్యాంకు ఖాతాలు ఇచ్చినా నిష్ర్పయోజనమే. కాని ఈ దిశగా తామేం చేస్తామనే అంశంపై మోడీ ప్రభుత్వం ఇంతవరకు సూచించలేదు. రైతు లకు అవసరమైన రుణసౌకర్యం అందించేలా బ్యాంకింగ్ వ్యవస్థను మార్చకుండా ఖాతాలు పెంచినా, బ్రాంచీలు ఏర్పాటు చేసినా ఫలితం సున్నే.
కె. రాజశేఖరరాజు