పలుకులమ్మ తోటమాలి

పలుకులమ్మ తోటమాలి


అక్షర తూణీరం

ఒక కుటుంబం కలసికట్టుగా చేసిన త్యాగం ఈ గ్రంథాలయం. ‘‘పలుకులమ్మ తోటమాలి’’ని అభినందన సంచికతో నేడు వారి కుటుంబం గౌరవిస్తోంది.

సముద్రం లోపల ముత్యపు చిప్పలుంటాయి. దానిలో చిన్న పురుగు ఉంటుంది. ఆల్చిప్పల్లోకి ఇసుక రేణువులు జొరబడతాయి. అతి సున్నితమైన ఆ పురుగు ఇసుక రేణువులతో కలిగే చికాకును అస్సలు భరించలేదు. తన నోట్లోంచి తెల్లటి జిగుర్ని ఊరించి, ఆ రేణువులచుట్టూ పొదిగి గరగరల నించి ఉపశమనం పొందుతుంది. ఆ జెల్లీ మెల్లగా గట్టిపడుతుంది. అదే మనం ధరించే మంచి ముత్యం (స్వాతి చినుకులు కేవలం కవి సమయాలు మాత్రమే) అంటే, ఒక్కోసారి కొన్ని గరగరలు, జీవుడి వేదనలు జాతికి మేలు చేస్తాయి. అలా జరిగిన ఒకానొక మేలు– గుంటూరు బృందావన గార్డెన్స్‌లో వెల సిన అన్నమయ్య గ్రంథాలయం. ఒక్క మనిషి కృషి, ఒక్క రెక్క శ్రమ, ఒక్క పురుగు దురద. అరవై ఏళ్లలో లక్షంజిల్లర పుస్తకాలను సేకరించి, పదిలపరచి, ముడుపుకట్టి శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధికి చేర్చి కృతార్థులైనారు. ఈ గ్రంథాళ్వార్‌ అసలు పేరు లంకా సూర్యనారాయణ. సహస్ర చంద్ర దర్శనానికి చేరువలో ఉన్నా, పుస్తక సేక రణపట్ల ఏ మాత్రం ఉత్సాహం తగ్గలేదు. తను సేకరించలేని అపురూప గ్రంథా లను తలచుకుంటూ అసంతృప్తి పడే మంచి ముత్యం ఎల్లెస్‌.



గుంటూరు సమీపంలోని చిన్న గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మిం చిన లంకా ఉన్నత చదువులు చదివి సెంట్రల్‌ ఎక్సైజ్‌శాఖలో వివిధ హోదా ల్లో పని చేశారు. తలచుకుంటే బారువు లకొద్దీ బంగారం ఇచ్చే శమంతకమణి లాంటి శాఖలో ఉన్నా, పెద్ద మనిషి గానే మిగిలిపోయారు లంకా సూర్య నారాయణ. కాలేజీ రోజుల్లోనే పుస్త కాల పిచ్చి పట్టుకున్న ఈ ఆసామి ఇంటిళ్లిపాదినీ తన హాబీకి అనుగు ణంగా మలచుకున్నారు. సంతృప్తి, సింప్లిసిటీ ఇవే గొప్ప అలంకారాలని కుటుంబ సభ్యుల్ని విజయవంతంగా నమ్మించగలిగారు. దరిమిలా ఎల్లెస్‌ తన వ్యసనాన్ని ప్రశాంతంగా పండిం చుకోగలిగారు. శ్రీ విద్యనుంచి శ్రీ శ్రీ సాహిత్యందాకా ఆయన సేకరణలో లేనివి లేవు. సాహిత్యం, సంగీతం, కళ లపై పత్రికల్లో వచ్చిన కండపుష్టిగల వ్యాసాలను కత్తిరించి, ఒకచోట గుచ్చెత్తడం లంకా చేసిన గొప్ప పని. అసంఖ్యాకంగా ఉన్న అలాంటి సంపుటాలు అన్నమయ్య లైబ్రరీకి అదనపు ఆకర్షణ.



ఇంట్లో కొండలుగా పెరిగిపోయిన పుస్తకాలు ఆ వేంకటేశ్వరస్వామి సన్నిధిని చేరాయి. తర్వాత అన్నమయ్య ఉద్యానంలోని భవనాన్ని అలంకరించాయి. లక్షకు పైగా పుస్తకాలను ఆయనొక్కరే వైనంగా చేరవేసి సర్దారు. అది చూశాక నేను అపు రూపంగా చూసుకునే ఎన్‌సైక్లోపీడియా వాల్యూములు, ప్రారంభంనించీ భారతి సంచికల బైండ్లు, ఆంధ్ర వారపత్రిక ఉగాది సంచికలు, మరికొన్ని మంచి పుస్తకాలు ఆ ఆళ్వార్‌ చేతిలో పెట్టి బరువు దించుకున్నాను. దేవుడు ప్రత్యక్షమై వాగ్దేవిపట్ల నీ భక్తికి మెచ్చాను. వరం కోరుకోమంటే, నా అశ్రద్ధవల్ల వసుచరిత్ర ప్రాచీన ప్రతి తాలూకు అనుక్రమణిక పుట రాలిపోయింది. దాన్ని తిరిగి మొలిపించి పుణ్యం కట్టుకోమని లంకా కోరతాడని ఒక ఐతిహ్యం మిత్రుల మధ్య ప్రచారంలో ఉంది.



ఒక కుటుంబం యావత్తూ కలసికట్టుగా చేసిన త్యాగం ఈ గ్రంథాలయం. అందరికీ శిరçస్సువంచి నమస్కరిస్తున్నాను. ‘‘పలుకులమ్మ తోటమాలి’’ని అభినం దన సంచికతో నేడు వారి కుటుంబం గౌరవిస్తోంది. ఇలాంటి మాలీలు మన జాతి సంపదలు– వరుసన్‌ నీ ఘనరాజసంబు వర్ధిల్లు నారాయణా!



(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

శ్రీరమణ

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top