
తితిక్ష
‘తితిక్ష’ అందమైన పదం. తితిక్ష అంటే ఓర్పు, సహ నం, సుఖదుఃఖాలు రెంటినీ ఉదాసీనంగా స్వీకరించే శక్తి. తితిక్షువు అంటే ఓర్పరి.
‘తితిక్ష’ అందమైన పదం. తితిక్ష అంటే ఓర్పు, సహ నం, సుఖదుఃఖాలు రెంటినీ ఉదాసీనంగా స్వీకరించే శక్తి. తితిక్షువు అంటే ఓర్పరి. అనిత్యమై, వచ్చిపోతూ ఉండే సుఖదుఃఖదాయకాలైన శీతోష్ణాది ద్వంద్వాలను తితిక్ష చేయమంటుంది భగవద్గీత. ‘అర్జునా! నువ్వు శోకించదగని విషయాలను గురించి శోకిస్తున్నావు. ప్రాణుల మరణం గురించి జ్ఞానులు నీ లాగా శోకిం చరు. ఎందుకంటే నువ్వూ, నేనూ, ఈ యుద్ధం చేస్తున్న భీష్మద్రోణాదులూ, రాజులూ మనమందరం దేహధా రులమైన ఆత్మలుగా శాశ్వతులం. దేహాలు మాత్రమే అశాశ్వతం. దేహధారికి కౌమారం, యౌవనం, వార్ధ క్యం వంటి మార్పులు ఎలా అనివార్యాలో, ఒక దేహం వదిలి మరొక దేహం ఆశ్రయించటం అంత స్వాభావి కమే. మరణం దేహానికే. దేహధారికి దేహాంతర ప్రాప్తి తప్ప మరణం ఉండదు.
దేహధారుల సుఖదుఃఖాలకు కారణం ‘మాత్రాస్పర్శ’. ‘మాత్రలు’ అంటే జ్ఞానేంద్రియాల ద్వారా ప్రాణులు గ్రహించగల శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే ఇంద్రియ విషయాలు. వీటినే తన్మాత్రలు అని కూడా అంటారు. ‘మాత్రాస్పర్శ’ అంటే ఇంద్రియ విషయాలతో సంబం ధం. ఈ సంబంధమే ప్రాణికి సుఖదుఃఖాను భవాలు కలిగిస్తుంది. ఉదాహరణకు ‘చల్లదనం’ అనే ఇంద్రియ విషయంతో స్పర్శేంద్రియానికి సంబంధం ఏర్పడి, ‘శీత స్పర్శ’ అనే అనుభవం కలుగుతున్నది. వేసవి కాలంలో ఈ ‘శీతస్పర్శ’ అనేది ప్రాణికి సుఖం కలిగించే అనుభ వం. చలికాలంలో అదే శీతస్పర్శ దుఃఖదాయకం కావ చ్చు. అలాగే ‘ఉష్ణత్వం’ అనే ఇంద్రియ విషయంతో స్పర్శేంద్రియానికి సంబంధం ఏర్పడి ‘ఉష్ణస్పర్శ’ అనే అనుభవం కలుగుతుంది. శీతకాలంలో ఇది సుఖం, వేసవి కాలంలో దుఃఖం.
శీతమూ, ఉష్ణమూ లాంటి సుఖ, దుఃఖ దాయకా లైన అనుభవాలన్నీ మాత్రాస్పర్శల వల్ల కలిగేవే. ఇవి ‘ఆగమ-అపాయ’ స్వభావం కలవి. అంటే, వస్తూ ఉం టాయి, పోతూ ఉంటాయి. ఇవి అనిత్యాలు. శాశ్వతా లు కావు. ‘ముక్తి’ అనే శాశ్వత ఆనంద స్థితిని కోరే ముముక్షువులు మాత్రాస్పర్శ జనితమైన శీతోష్ణాది సుఖ దుఃఖాలను పట్టించుకోకూడదు. ‘వాటిని ఓర్చుకొని, సహించి, ఉదాసీనంగా అనుభవించాలి’ అని భగవద్వ చనం. అలా అనుభవించగల శక్తిని ‘తితిక్ష’ అంటారు.
ప్రారబ్ధ కర్మ ఫలాలను చింతా, విచారమూ లేకుండా సహించటమూ, వాటిని ఎలా ఉపశమనం చేసుకోవచ్చు అనే ఆలోచన కూడా లేకుండా ఆ ప్రారబ్ధమేదో త్వరగా పూర్తిగా అనుభవించేసి వదిలిం చుకోవడానికి సిద్ధంగా ఉండటమే ‘తితిక్ష’. వజ్రాయు ధంతో కూడా ఛేదించలేని దృఢమైన కవచం తితిక్ష. దీన్ని ధరించి ధీరుడు మాయను జయిస్తాడు. తప, దాన, జ్ఞాన, తీర్థ, ప్రతాది పుణ్య కర్మల ఫలాలూ, ఐశ్వ ర్యమూ, స్వర్గమూ, మోక్షమూ - వీటిలో ఏది కోరిన వారికి అది తితిక్ష ద్వారా లభిస్తుంది. తితిక్ష దీర్ఘ కాలి కమైన సాధనతో అలవడే సద్గుణం. తీవ్రమైన మోక్ష కాంక్షా, ప్రాపంచిక వ్యవహారాల పట్ల మహత్తరమైన అనాసక్తీ - ఈ రెండూ తితిక్షను పెంపు చేసేందుకు సహకరించే కారణాలు అంటారు భగవత్పాదులు.
ఎం.మారుతిశాస్త్రి