బహిష్కరణకూ ఓ పద్ధతుంది! | Sakshi
Sakshi News home page

Mahua Moitra: బహిష్కరణకూ ఓ పద్ధతుంది!

Published Fri, Dec 15 2023 2:53 AM

Editorial Column On TMC MP Mahua Moitra Suspension In Parliament - Sakshi

పార్లమెంట్‌ సభ్యురాలు మహువా మోయిత్రాను సభా సభ్యత్వం నుండి డిసెంబర్‌ 8న లోక్‌సభ బహిష్కరించింది. ఆమెను లోక్‌సభలో ప్రసంగించడానికి అనుమతించలేదు. ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్‌ చేశారు. అయినా మొయిత్రాను 17వ లోక్‌సభ నుండి బహిష్కరించే తీర్మానాన్ని సభ ఆమోదించింది. ఉనికిలో లేని నీతి నియమావళితో ఆమెను దోషిగా నిర్ధారించారు. పార్లమెంటు తనను తానే నియంత్రించుకుంటుంది కాబట్టి, ఎంపికైన ప్రజా ప్రతినిధి సభ్యత్వాన్ని రద్దు చేయడం అనే తీవ్రమైన చర్యను నిందకు తావులేని ప్రక్రియ ద్వారా చేయాలి. చట్టసభలకు ఎన్నికైన ప్రతినిధుల దుష్ప్రవర్తన, నైతిక ఉల్లంఘనల ప్రశ్నలను ఎదుర్కోవటానికి రెండు ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, బ్రిటన్ ఉదాహరణలు మనకు ఉన్నాయి.

మహువా మొయిత్రాను బహిష్కరించే తీర్మా నాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ ప్రవేశపెట్టారు. మొయిత్రా ప్రవర్తన (ఆమె తన పార్ల మెంటరీ లాగిన్‌ వివరాలను పంచుకోవడం, వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ నుండి నగదును, సౌకర్యాలను స్వీకరించడం) పార్ల మెంట్‌ సభ్యురాలికి తగదని ఆ తీర్మానం పేర్కొంది. బహిష్కరణ ప్రక్రియను వెంటాడి వేధించడంగా అభివర్ణించారు మొయిత్రా. తనపై ఆరోపణకు సంబంధించి డబ్బు మార్పిడికి ఎలాంటి రుజువు లేదనీ, నైతిక కమిటీలో తనకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యం ప్రేరేపితమైనదనీ, ఇది వైరుద్ధ్యపూరితంగా ఉందనీ అన్నారు. తనపై నిందమోపిన వారిని ఎదురు ప్రశ్నించడానికి ఆమెను అనుమతించలేదు.

మన పార్లమెంట్‌ పనితీరుకు సంబంధించినంత వరకు ఈ మొత్తం అధ్యాయం వివాదాస్పదమైంది. రాజకీయాలు, వ్యక్తిత్వం ఈ ప్రక్రియను కప్పివేశాయి. పార్లమెంట్‌ తన వ్యవహారాల నిర్వహణకు సొంత నిబంధనలను రూపొందించుకునే అధికారాన్ని మన రాజ్యాంగం ఇచ్చింది. దుష్ప్రవర్తన కారణంగా దాని సభ్యులను బహిష్కరించే అధికారం దీని పర్యవసానమే. పార్లమెంటు తనను తానే నియంత్రించుకుంటుంది కాబట్టి, ఎంపికైన ప్రజా ప్రతినిధి సభ్యత్వాన్ని రద్దుచేయడం అనే తీవ్రమైన చర్యను నిందకు తావులేని ప్రక్రియ ద్వారా చేయాలి.

చట్టసభలకు ఎన్నికైన ప్రతినిధుల దుష్ప్రవర్తన, నైతిక ఉల్లంఘ నల ప్రశ్నలను ఎదుర్కోవటానికి రెండు ప్రజాస్వామ్య దేశాలైన అమె రికా, బ్రిటన్‌ల ఉదాహరణలు మనకు ఉన్నాయి. అమెరికన్‌ కాంగ్రెస్‌తో మొదలుపెడదాం: డిసెంబర్‌ 1న అమెరికా ప్రతినిధుల సభ, న్యూయార్క్‌ రిపబ్లికన్‌ గెరోజ్‌ శాంటోస్‌ను తన సభ్యత్వం నుండి బహిష్కరించింది. ఎన్నికల ప్రచారంలో వంచన, ఆర్థికపరమైన అవక తవకలు, ఉల్లంఘనలు, లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలపై సుమారు తొమ్మిది నెలల విచారణ తర్వాత ఈ బహిష్కరణ ఆదేశం వచ్చింది. 

రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధిపై వచ్చిన ఫిర్యాదులను రెండు వేర్వేరు కార్యాలయాలు పరిశీలించాయి. ఒకటి... కాంగ్రెషనల్‌ ఎథిక్స్‌ కార్యా లయం (ఓసీఈ). నైతిక చట్టంలో నైపుణ్యం కలిగిన న్యాయవాదులు, పరిశోధకులతో కూడిన స్వతంత్ర, పక్షపాతం లేని ఈ సంస్థను 2008లో స్థాపించారు. ఇది హౌస్‌ సభ్యులపై, కాంగ్రెస్‌ సిబ్బందిపై ఫిర్యాదులను స్వీకరిస్తుంది, పునఃపరిశీలిస్తుంది. ఒక వివరణాత్మక పరీక్ష తర్వాత, ఇది తన సిఫార్సును ఎథిక్స్‌ కమిటీకి పంపుతుంది. ఇది స్వీకరించే ఫిర్యాదులు, వాటిపై తీసుకునే చర్యల గురించి వివరణా త్మక గణాంకాలను కూడా ప్రచురిస్తుంది. 

శాంటోస్‌పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన రెండో కార్యా లయం హౌస్‌ ఎథిక్స్‌ కమిటీ. ఇది ఇతర సభ్యుల నుండి ఫిర్యాదులను స్వీకరించింది. ‘ఓసీఈ’ నుండి సూచనను, శాంటోస్‌ వ్యవహారాన్ని విచారించిన ప్రతినిధుల సభ నుండి తీర్మానాన్ని హౌస్‌ ఎథిక్స్‌ కమిటీ పరిశీలించి ఒక పరిశోధనాత్మక సబ్‌ కమిటీని నియమించింది. ఇది 40 మంది సాక్షులను ఇంటర్వ్యూ చేసింది. 72,000 పేజీల పత్రాలను అందుకుంది. సబ్‌కమిటీకి తన వివరణను ఇవ్వడానికి ఎథిక్స్‌ కమిటీ శాంటోస్‌నూ అనుమతించింది. కాని దాన్ని ఆయన తిరస్కరించారు.

శాంటోస్‌ ‘తన వ్యక్తిగత ఆర్థిక లాభం కోసం, ప్రతినిధుల సభకు తన అభ్యర్థిత్వంలోని ప్రతి అంశాన్నీ మోసపూరితంగా ఉపయోగించు కోవాలని చూసినట్లు’ పరిశోధనాత్మక కమిటీ కనుగొంది. ఎథిక్స్‌ కమిటీ నివేదికలోని బహిష్కరణ ప్రతిపాదనను ప్రతినిధుల సభ పరి గణనలోకి తీసుకుంది. కాంగ్రెస్‌ సభ్యుడిని తొలగించడానికి అమెరికా రాజ్యాంగం ఒక భారీ అడ్డంకిని ఉంచింది. అలాంటి తొలగింపు ప్రతి పాదనకు సంబంధిత సభలోని మూడింట రెండొంతుల మంది సభ్యులు అంగీకరించాలి. అతడిని తొలగించడానికి చేసిన మొదటి రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. మూడవ ప్రయత్నంలో, అతని రిపబ్లికన్‌ పార్టీకి చెందిన 105 మంది సభ్యులు కూడా 206 మంది డెమోక్రాట్‌లతో కలిసి శాంటోస్‌ని బహిష్కరించారు.

ఎంపీల ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండేలా పర్యవేక్షించ డానికి బ్రిటన్‌ పార్లమెంట్‌ కూడా విస్తృతమైన యంత్రాంగాన్ని కలిగి ఉంది. ఇది ప్రయోజనాలకు సంబంధించిన పబ్లిక్‌ రిజిస్టర్‌ని నిర్వ హిస్తుంది. ఎంపీలు తమ పార్లమెంటరీ విధుల సమయంలో పొందిన ఆదాయాలు, ఆతిథ్యం, బహుమతులను తప్పనిసరిగా ప్రకటించాలి. పార్లమెంటరీ ప్రమాణాల కమిషనర్‌ అని పిలిచే ఒక స్వతంత్ర అధికారి ఈ రిజిస్టర్‌ను నిర్వహిస్తారు. ఎంపీలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలి స్తారు. కమిషనర్‌ పనిని ఎంపీల స్టాండర్డ్స్‌ కమిటీ సమీక్షిస్తుంది.ఎంపీలపై ఎలాంటి చర్య తీసుకోవాలో సిఫారసు చేస్తుంది.

2009లో, ఖర్చుల కుంభకోణం (హౌస్‌ ఆఫ్‌ కామర్స్ ఎంపీలు పార్లమెంట్‌ నుండి వ్యక్తిగత ఖర్చులను రీయింబర్స్‌ చేయడం) తర్వాత, ఎంపీలు, వారి సిబ్బంది వేతనాలు, పింఛన్లను నియంత్రించేందుకు స్వతంత్ర పార్లమెంట్‌ ప్రమాణాల సంస్థను ఏర్పాటు చేయడానికి బ్రిటన్‌ ఒక చట్టాన్ని కూడా ఆమోదించింది. ఫిర్యాదులను స్వీకరించడానికి, దర్యాప్తు చేయడానికి స్వతంత్ర యంత్రాంగాలతో పాటు, అమెరికా, బ్రిటన్‌ పార్లమెంటులు, వారి సభ్యులు అనుసరించ డానికి వివరణాత్మక మార్గదర్శకాలను కూడా అందించాయి. ఉదాహ రణకు అమెరికాలో ఈ సంవత్సరం ప్రారంభంలో, కాంగ్రెషనల్‌ ఎథిక్స్‌ కార్యాలయం ఒక విషయాన్ని హౌస్‌ ఎథిక్స్‌ కమిటీకి సూచించింది; ప్రతినిధుల సభకు చెందిన అలెగ్జాండ్రియా ఒకాసియో– కోర్టెజ్, 2021లో ఛారిటీ మెట్‌ గాలాలో ధరించేందుకు మేకప్‌ సేవలు, హ్యాండ్‌బ్యాగ్, ఆభరణాలు, దుస్తులను అంగీకరించడం ద్వారా బహు మతి నియమాలను ఉల్లంఘించి ఉండవచ్చంది.

భారతదేశంలో రాజ్యసభ ఎథిక్స్‌ కమిటీ తన ఎంపీలకు ప్రవ ర్తనా నియమావళిని నిర్వచించింది. రాజ్యసభ ఎంపీలు తమ పార్ల మెంటరీ వ్యవహారాల కోసం ఎలాంటి ప్రయోజనాలనూ అంగీకరించకూడదని కోడ్‌ నిర్దేశిస్తుంది. వారి వ్యక్తిగత ప్రయోజనాలకూ, ప్రజా ప్రతినిధిగా వారి విధినిర్వహణకూ మధ్య వైరుద్ధ్యం ఏర్పడిన సంద ర్భాల్లో, వారు తమ ప్రభుత్వ కార్యాలయానికి బాధ్యత వహించాలని కూడా ఇది పేర్కొంది. రాజ్యసభ ఎంపీలు తప్పనిసరిగా బ్రిటన్‌ పార్లమెంట్‌ పద్ధతిలో వలే సభ్యుల ప్రయోజనాల రిజిస్టర్‌ను కూడా పూరించాలి. ప్రత్యక్షంగా ఎన్నికైన సభ ఇంకా ఈ నిబంధనలను తన నియమాలలో పొందుపరచనందున ఈ కోడ్, రిజిస్టర్‌ రాజ్యసభ ఎంపీలకు వర్తిస్తుంది తప్ప లోక్‌సభ సభ్యులకు కాదు.

1951లో నాటి మన తాత్కాలిక పార్లమెంటు తన సభ్యులలో ఒకరైన హెచ్‌జి ముద్గల్‌ సభా గౌరవాన్ని కించపరిచేలా ప్రవర్తించిన మొదటి కేసును ఎదుర్కొంది. ఈ కేసులో ముద్గల్‌ను సమర్థించుకోవ డానికి అనుమతించారు. ఆ తర్వాత సభ తనను బహిష్కరించే ముందు ఆయన రాజీనామా చేశారు. ఆయన ప్రవర్తనను పరిశీలించిన కమిటీ, ఎంపీలకు ప్రవర్తనా నియమావళిని విధించాలని కోరింది. ఏ సభ్యుడైనా సంబంధిత పార్టీల నుండి ద్రవ్య లేదా ఇతర పరిగణనలను అంగీకరించడంపై నిర్దిష్ట కారణాలను, ప్రయోజనాలను సమర్థించు కోవడం అనేది ప్రజాస్వామ్యానికి విషం అవుతుంది.
72 ఏళ్ల తరువాత, ఇదే విధమైన ప్రశ్నపై బహిరంగ చర్చ కేంద్రీకృతమై ఉన్నందున, ఎంపీల నైతిక నిబంధనల ఉల్లంఘనలను నిర్ణయించడానికి పార్లమెంటుకు పటిష్ఠమైన విధానం ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఇటువంటి ప్రక్రియ పార్లమెంటు గౌరవాన్ని నిలబెట్టి, దాని శాసన సమగ్రతను కాపాడే సాధనంగా మారుతుంది. దాని నిర్ణ యాల గురించి ఎలాంటి అనుమానాలనైనా తొలగించివేస్తుంది.

వ్యాసకర్త, చక్షూరాయ్,  లెజిస్లేటివ్‌ అండ్‌ సివిక్‌ ఎంగేజ్‌మెంట్‌ హెడ్, పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ (‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో) 

Advertisement
 
Advertisement
 
Advertisement