కూలీ నుంచి మేనేజర్‌గా..

Vegetable Seller Habeeb Success Story in Abu Dhabi - Sakshi

ఒకప్పుడు మారుమూల పల్లెలో కూరగాయలమ్మిన ఆ యువకుడు.. ఇప్పుడు అబుదాబీ మాల్స్‌లో రెస్టారెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గల్ఫ్‌లో భవన నిర్మాణ కూలీగా జీవితం మొదలుపెట్టి పట్టుదలతో మెరుగైన జీవనానికి బాటలు వేసుకున్నాడు. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం వీవీరావుపేటకు చెందిన హబీబ్‌కు చిన్నప్పుడే కుటుంబ బాధ్యతలు మీదపడ్డాయి. అతని తండ్రి దుబాయిలో అనారోగ్యంతో మృతిచెందడంతో కుటుంబ పోషణ హబీబ్‌ చూసుకోవాల్సి వచ్చింది. స్కూల్‌కు వెళ్తూనే.. గ్రామంలో కూరగాయలు అమ్మాడు. ఇలా ఆరేళ్లు గడిచిన తర్వాత హబీబ్‌ గల్ఫ్‌కు వెళ్లాడు. 1998లో భవన నిర్మాణ కూలీగా అబుదాబీలో అడుగుపెట్టాడు. పదకొండు నెలల తరువాత యజమాని పనిలేదని చెప్పి పంపించాడు.

ఆ తర్వాత హబీబ్‌ అక్కడే ఓ రెస్టారెంట్‌లో డిష్‌ వాషర్‌గా పనిలో కుదిరాడు. ఇంగ్లిష్‌ నేర్చుకుంటే జీతం ఎక్కువ వస్తుందని తెలుసుకుని ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సంపాదించాడు. వెయిటర్‌గా.. తరువాత  క్యాషియర్‌గా పనిచేశాడు. చైనీస్‌ డిషెస్‌ నేర్చుకుని కుక్‌గా ఎదిగాడు. తన చొచ్చుకుపోయే స్వభావం వల్ల మార్కెటింగ్‌ స్థాయికి ఎదిగాడు. తరువాత పీఆర్వోగా సైతం పనిచేశాడు. తాను పనిచేసే రెస్టారెంట్‌ కొత్త బ్రాంచ్‌లకు ఉద్యోగులు అవసరం ఉంటుండడంతో తన గ్రామం వారిని, స్నేహితులకు ఉపాధి చూపించాడు. 40 మందికి ఉచితంగా వీసాలిప్పించాడు. కొంత కాలం తర్వాత స్వస్థలానికి వచ్చిన ఆయన.. వివిధ వ్యాపారాలు నిర్వహించాడు. అవి కలిసిరాకపోవడంతో ఆర్థికంగా కొంత నష్టపోయాడు. దీంతో మళ్లీ గల్ఫ్‌ బాట పట్టాడు. అబుదాబీలో మూడు సంవత్సరాలుగా కౌలూన్‌ చైనీస్‌ రెస్టారెంట్‌ బ్రాంచ్‌కు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. పడి లేచిన కెరటంలా హబీబ్‌ జీవన ప్రస్తానం కొనసాగింది. ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, మలయాళం, నేపాలీ, అరబ్బీ భాషలపై ఆయనకు పట్టుంది. కాగా, హబీబ్‌ ప్రస్తుతం స్వగ్రామానికి కోఆప్షన్‌ సభ్యుడిగా ఎంపికయ్యాడు.-తోకల ప్రవీణ్, మల్లాపూర్‌

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top