నీతి అయోగ్‌ ర్యాంకింగ్‌.. టాప్‌ టెన్‌లో విజయనగరం

Vizianagaram Top Ten Districts In NITI Aayog Delta Rankings - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వ్యవసాయ రంగంలో పురోగతి సాధిస్తున్న టాప్‌ టెన్‌ జిల్లాల్లో విజయనగరం జిల్లా ఉన్నట్లు గురువారం రాజ్య సభలో  వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా  ప్రణాళికా శాఖ సహాయ మంత్రి రావు ఇందర్‌జిత్‌ సింగ్‌ వెల్లడించారు. వ్యవసాయ రంగంలో పురోగతిని అధ్యయనం చేసేందుకు నీతి అయోగ్‌ వివిధ రాష్ట్రాల నుంచి 117 జిల్లాలను ఎంపిక చేయగా అందులో ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి కడప, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు ఉన్నాయి.

మార్చి 2018 నుంచి మే 2018 మధ్య కాలంలో వ్యవసాయ రంగం పనితీరు సూచికల్లో సాధించిన పురోగతి ప్రాతిపదికపై ఆయా జిల్లాలకు నీతి అయోగ్‌ డెల్టా ర్యాంకింగ్‌ పేరిట ర్యాంక్‌లు జారీ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. అలా టాప్‌ టెన్‌ ర్యాంక్‌ సాధించిన జిల్లాల్లో ఒడిషాలోని కలహండి, మల్కాన్‌గిరి, తమిళనాడులోని రామనాధపురం, తెలంగాణలోని ఖమ్మం, పంజాబ్‌లోని మోగ, మణిపూర్‌లోని చాండెల్‌, ఏపీలోని విజయనగరం, అస్సాంలోని హైలకాండి, కర్నాటకలోని యాద్గిర్‌, సిక్కింలోని వెస్ట్‌ డిస్ట్రిక్ట్‌ టాప్‌ టెన్‌లో  వరుసగా 1 నుంచి 10  స్థానాలు ఆక్రమించినట్లు మంత్రి తెలిపారు

ఆయా రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 117 అభిలషణీయ జిల్లాల్లో సత్వర మార్పును తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.  వ్యవసాయం, నీటి వనరుల యాజమాన్యం ప్రధాన అంశాలు కాగా, ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య, ఆర్థిక స్వావలంబన, నైపుణ్య అభివృద్ధి వంటి ఇంతర అంశాల ప్రాతిపదికపై ఆయా జిల్లాల్లో నిర్ణీత కాలపరిమితిలో సాధించిన పురోగతిని పరిగణలోకి తీసుకుని డెల్టా ర్యాంకింగ్‌లు జారీ చేసినట్లు ఇందర్‌జిత్‌ సింగ్‌ వివరించారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top