‘వడ్డీ బకాయిపడితే దివాలా తీసినట్లు కాదు’

Vijaya Sai Reddy Speech In Rajya Sabha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రుణాలపై వడ్డీ బకాయిలు చెల్లించని సంస్థను బ్యాంకులు దివాలా ప్రక్రియకు తీసుకెళ్లడం విచారకరమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఇన్‌సాల్వెన్సీ, బాంక్రప్టసీ కోడ్‌ సవరణ బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ బిల్లులో రుణం, క్లెయిమ్‌, డిఫాల్ట్‌ అనే పదాలను నిర్వచించారు.. కానీ రుణాలపై వడ్డీ అనే పదానికి సరైన నిర్వచనం లేదని తెలిపారు. రుణాలపై వడ్డీ బకాయిల చెల్లింపులో విఫలమైన కేసులను ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ దివాలా పరిష్కార ప్రక్రియకు సిఫార్సు చేస్తోందని.. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానం చెప్పాలని కోరారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న సంస్థలకు, ఆర్థికంగా ఇబ్బందులు లేకపోయిన ఇతర ఒడిదుడుకులకు లోనైన సంస్థలకు మధ్య కచ్చితమైన నిర్వచనం చేసినప్పుడు మాత్రమే అది పటిష్టమైన రుణ పరిష్కార చట్టం కాగలదని ఆయన అభిప్రాయపడ్డారు.

కంపెనీ ఆస్తులకంటే భవిష్యత్తుల్లో అది ఆర్జించే లాభాల విలువ తక్కువగా ఉంటే అలాంటి కంపెనీనిని ఆర్థికంగా కష్టాల్లో ఉన్నట్టు గుర్తించాలని కోరారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు లేకపోయినప్పటికీ.. కేవలం రుణాలు లేదా వడ్డీ చెల్లించలేని స్థితిలో ఉన్న కంపెనీని దివాలా పరిష్కార ప్రక్రియకు పంపడం సరైన నిర్ణయం కాదాన్నరు. అలాంటి సంస్థ ఆస్తులను గుర్తించి.. అది తిరిగి మనుగడ సాగించేలా తోడ్పాటు అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. దేశంలో ఇప్పటికే నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్స్‌(ఎన్‌సీఎల్‌టీ) పనిచేస్తున్నాయని.. మరో రెండు ప్రారంభం కావాల్సి ఉందన్నారు. మరో 24 దివాలా పరిష్కార కోర్టులను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన అంశాన్ని ప్రస్తావించారు. ఎస్‌సీఎల్‌టీలలో మొత్తం 60 మంది న్యాయాధికారులు, సాంకేతిక సభ్యులు పని చేయాల్సి ఉండగా కేవలం 27 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారని.. వారు 2,500 కేసులపై పనిచేస్తున్నట్టు తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top