భారత్‌కు చేరిన అమెరికా వెంటిలేటర్లు

US Donates First Tranche of 100 Ventilators to India - Sakshi

న్యూఢిల్లీ: కరోనాకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భారత్‌కు సహాయపడటానికి అమెరికా ప్రభుత్వం మంగళవారం దాదాపు 1.2 మిలియన్ డాలర్ల విలువైన 100 అత్యాధునిక వెంటిలేటర్లను విరాళంగా ఇచ్చింది. భారతదేశం యొక్క అత్యవసర అవసరాలకు అనుగుణంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సామాగ్రిని అందించారని అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికాలో తయారైన ఈ వెంటిలేటర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారయ్యాయని.. కరోనావైరస్ బారిన పడిన రోగులకు చికిత్స చేయడంలో ఇవి భారతదేశానికి ఎంతో ఉపయోగపడతాయని ప్రకటించింది. అమెరికా భారతదేశానికి అందించాలని భావిస్తున్న 200 వెంటలేటర్లలో భాగమైన వీటిని యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్‌ఐఐడి) ద్వారా విరాళంగా ఇచ్చింది. (ఉచితంగా వెంటిలేటర్లు :  ట్రంప్ కీలక ప్రకటన)

యూఎస్‌ఐఐడి.. భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీతో పాటు ఇరు దేశాల్లోని ఇతర వాటాదారులతో కలిసి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో వెంటిలేటర్ల పంపిణీ, రవాణా, ప్లేస్‌మెంట్‌లో సహాయపడటానికి కృషి చేస్తోంది. భారతదేశానికి వెంటిలేటర్ల వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ మాట్లాడుతూ.. ‘కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అపార ఆరోగ్య నష్టాన్ని కలిగిస్తుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో భాగస్వామ్యం, సహకారం ద్వారానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించగలుగుతాము’ అని తెలిపారు. అంతేకాక అమెరికా ప్రజల ఔదార్యం, ఆ దేశ ప్రైవేట్ పరిశ్రమ ఆవిష్కరణల ద్వారా సాధ్యమైన వెంటిలేటర్లను భారత్‌కు విరాళంగా ఇవ్వడానికి అమెరికా సంతోషిస్తుంది అన్నారు. (చౌకైన వెంటిలేటర్‌)

వెంటిలేటర్లను దానం చేసే అంశం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మొదట మే 16న ట్వీట్ ద్వారా ప్రకటించారు. కోవిడ్‌-19 కోసం వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి ఇరువర్గాలు కూడా కృషి చేస్తున్నాయని తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్ ఫోన్ కాల్ సందర్భంగా వెంటిలేటర్ల అంశం చర్చకు వచ్చింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top