గిరిజన, దళిత సంఘాల భారత్‌ బంద్‌ పిలుపు

Tribal Dalit Groups To Observe Bharat Bandh Today - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అటవీ హక్కుల చట్టం కింద ప్రయోజనాలు నిరాకరించబడిన కుటుంబాలను తక్షణమే ఆయా ప్రాంతాల నుంచి తరలించాలని ఫిబ్రవరి 13న సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా గిరిజన, దళిత సంఘాలు మంగళవారం భారత్‌ బంద్‌కు పిలుపు ఇచ్చాయి. సుప్రీం ఉత్తర్వులతో పది లక్షల మంది గిరిజనులు, అడవిపై ఆధారపడిన వారి హక్కులకు విఘాతం కలుగుతుందని భావిస్తున్నారు. అటవీ హక్కుల చట్టాన్ని పునరుద్ధరించాలని కోరుతూ గిరిజన సంఘాలు దేశ రాజధానిలో మండీ హౌస్‌ నుంచి జంతర్‌ మంతర్‌ వరకూ భారీ ప్రదర్శన చేపడుతున్నాయి. 

గిరిజనులు, ఆదివాసీల హక్కుల పరిరక్షణను న్యాయస్ధానంలో కేంద్ర ప్రభుత్వం సమర్ధంగా తన వాదనను వినిపించలేదని గిరిజన సంఘాలు భగ్గుమంటున్నాయి. అటవీ హక్కుల చట్టం కింద తమ ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం తక్షణమే ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నాయి. కాగా గుజరాత్‌, రాజస్తాన్‌, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ సహా పలు ఈశాన్య రాష్ట్రాలు నేటి బంద్‌లో పాల్గొంటున్నాయి. మరోవైపు యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ సభ్యుల నియామకంలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు సంబంధించి అలహాబాద్‌ హైకోర్టు ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్ధానం సమర్ధించినందుకు నిరసనగా గిరిజన సంఘాల సమ్మెలో పాల్గొనాలని దళిత సంఘాలు నిర్ణయించాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top