ఆ నటి ఆస్తులు రూ. 2.43 కోట్లు!!

TMC MP Candidate Mimi Chakraborty Declared Her Assets Worth Rs. 2.43 Crore - Sakshi

కోల్‌కతా : తొలిసారిగా ఎన్నికల బరిలో దిగుతున్న బెంగాలీ నటి మిమీ చక్రవర్తి నామినేషన్‌ దాఖలు చేశారు.  అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బెంగాల్‌లోని జాధవ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తన మొత్తం ఆస్తుల విలువ రూ. 2. 43 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. ఇందులో తన చరాస్తుల విలువ 1.24 కోట్ల రూపాయలని వెల్లడించారు.

నాపై క్రిమినల్‌ కేసులు లేవు..
తన చేతిలో ప్రస్తుతం రూ. 25 వేల నగదు ఉందని పేర్కొన్న మిమీ చక్రవర్తి, బ్యాంకు డిపాజిట్ల రూపంలో 71.89 లక్షల రూపాయలు ఉందని అఫిడవిట్‌లో తెలిపారు. ఇక మ్యూచువల్‌ ఫండ్స్‌ రూపంలో 50 వేల రూపాయలు కలిగి ఉన్నానని వెల్లడించారు. స్థిరాస్తుల విషయానికి వస్తే 1.19 కోట్ల రూపాయల విలువైన సొంత ఫ్లాట్‌ కలిగి ఉన్నానని పేర్కొన్నారు. తన కారు మీద 19 లక్షల రూపాయల లోన్‌ ఉందని తెలిపారు. గతేడాది ఆర్థిక సంవత్సరంలో 15.39 లక్షల రూపాయల ఆదాయం పొందినట్లు వెల్లడించారు. ఇక కలకత్తా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన మిమీ చక్రవర్తి తనపై ఎటువంటి క్రిమినల్‌ కేసులు లేవని, ఓ కేసులోనూ తాను దోషిగా తేలలేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

కాగా 2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ తరపున 41 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తున్నట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముగ్గురు నటీమణులు నుస్రత్‌ జహాన్‌, మిమీ చక్రవర్తి, మున్‌ మున్‌ సేన్‌లకు మమత టికెట్లు ఖరారు చేశారు. వీరిలో అసనోల్‌ నియోజక వర్గం నుంచి కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియోకు పోటీగా మున్‌ మున్‌ సేన్‌ బరిలోకి దిగుతుండగా.. మిమీ చక్రవర్తి జాధవ్‌పూర్‌ నుంచి పోటీ చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top