తమిళనాడు కీలక నిర్ణయం.. సడలింపులు ఇవే

Tamil Nadu Announces Major Relaxations For Non Containment Zones Lockdown - Sakshi

లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తమిళనాడు.. మార్గదర్శకాలు జారీ

చెన్నై: ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభించే క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాన్‌- కంటైన్మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ నిబంధనలు మరింతగా సడలిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ సడలింపులు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. సవరించిన నిబంధనల ప్రకారం.. రాష్ట్ర రాజధాని చెన్నైలో నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు అమ్మే షాపులు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు తెరిచి ఉంచవచ్చని తెలిపింది.  మిగిలిన స్టోర్లు ఉదయం పదిన్నరకు తెరిచి.. సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. (మద్యం అమ్మకాలు.. సుప్రీంకు తమిళ సర్కార్‌)

అదే విధంగా ప్రైవేటు కంపెనీలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చని.. అయితే ఉదయం పదింటి నుంచి రాత్రి 7 వరకు మాత్రమే పనిచేయాలని స్పష్టం చేసింది. ఇక రాష్ట్ర, జాతీయ రహదారుల వెంబడి ఉన్న పెట్రోల్‌ పంపులు 24 గంటల పాటు సేవలు అందిస్తాయని వెల్లడించింది. నగరాల్లో మాత్రం ఉదయం ఆరింటికి తెరిచి.. రాత్రి 8 గంటలకు మూసి వేయాలని ఆదేశించింది. నిబంధనలు సడలించినప్పటికీ ప్రజలంతా తప్పక సామాజిక దూరం పాటించాలని... షాపులు, పరిసర ప్రాంతాలను రసాయనాలతో తరచుగా శుభ్రపరుచుకోవాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా శుక్రవారం ఒక్కరోజే ఒక్కరోజే రాష్ట్రంలో 600 మంది ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడ్డారు. (తొలి రోజే రూ.172 కోట్ల మద్యం అమ్మకాలు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top