వివాహేతర సంబంధం నేరం కాదు

Supreme Court strikes down Section 497 - Sakshi

ఐపీసీ సెక్షన్‌ 497కు కాలం చెల్లింది

అది మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తోంది

భర్తకు ఆస్తిగా పరిగణించడం భార్య హక్కు కాలరాయడమే

సుప్రీంకోర్టు సంచలన తీర్పు

న్యూఢిల్లీ: వివాహేతర సంబంధం నేరం కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. భర్తకు మహిళ వ్యక్తిగత ఆస్తి కాదని పేర్కొంటూ వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ సెక్షన్‌ 497ను కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు గురువారం ఏకాభిప్రాయంతో తీర్పు వెలువరించింది. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న సెక్షన్‌ 497కు కాలం చెల్లిందని, అది రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. బ్రిటిష్‌ కాలం నాటి వ్యభిచార వ్యతిరేక చట్టం మహిళలను మగవారు తమ సొంత ఆస్తిగా పరిగణించేలా ఉందని, వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.

ఇష్టపూర్వక శృంగారం మహిళ హక్కని, ఈ విషయంలో ఆమెకు షరతులు పెట్టలేమని స్పష్టం చేసింది. వివాహేతర సంబంధం నేరం కాకపోయినా, నైతికంగా తప్పేనని, దీన్ని కారణంగా చూపి వివాహాన్ని రద్దుచేసుకోవచ్చని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పును సామాజిక కార్యకర్తలు, పలువురు న్యాయవాదులు స్వాగతించారు. ఈ పురాతన చట్టాన్ని ఎప్పుడో రద్దు చేయాల్సిందని వారు అభిప్రాయపడ్డారు. మరోవైపు, వివాహేతేర సంబంధాలను నేరం కాదని ప్రకటించడం.. అక్రమ సంబంధాలకు అనుమతి ఇచ్చినట్లేనని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఐపీసీ సెక్షన్‌ 497ను ప్రవాస భారతీయుడు జోసెఫ్‌ షైన్‌ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఆ సెక్షన్‌ ప్రకారం శిక్ష విషయంలో స్త్రీపురుషుల మధ్య వివక్ష ఎందుకని ఆయన ప్రశ్నించారు.  

విడాకులకు కారణంగా చూపొచ్చు..
‘ఇది ఏకపక్ష, నిరంకుశమైన పురాతన చట్టం. మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాల కల్పనను అతిక్రమించేలా ఉంది’ అని భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లో వివాహేతర సంబంధాల్ని నేరంగా పేర్కొంటున్న సెక్షన్‌ 497ను కొట్టివేస్తూ సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ ఇందూ మల్హోత్రా ధర్మాసనం స్పష్టం చేసింది. మహిళలను వేరుగా పరిగణించడం రాజ్యాంగ ఉల్లంఘేనని,  స్వతంత్రత అనేది గౌరవప్రదమైన మానవ మనుగడలో భాగమని, అయితే సెక్షన్‌ 497 మహిళలకున్న ఎంపిక స్వేచ్ఛను హరిస్తుందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. వివాహేతర సంబంధం నేరం కాకపోయినప్పటికీ.. దానిని సామాజికంగా తప్పుగా పరిగణించడాన్ని కొనసాగించాలని, వివాహ రద్దు లేదా విడాకులకు దానిని పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది.

‘వివాహేతర సంబంధాల్ని నేరంగా పేర్కొంటున్న ఐపీసీ 497, వివాహానికి వ్యతిరేకంగా నేరాభియోగాలకు సంబంధించి సీఆర్‌పీసీలోని 198 సెక్షన్లను రాజ్యాంగ విరుద్ధమని మేం ప్రకటిస్తున్నాం’ అని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ప్రకటించారు. మహిళలను తక్కువగా చూసే ఏ నిబంధన కూడా రాజ్యాంగబద్ధం కాదని, మహిళకు భర్త యజమాని కాడని చెప్పే సమయం ఆసన్నమైందని జస్టిస్‌ ఖన్విల్కర్‌ పేర్కొన్నారు. సెక్షన్‌ 497 అనేది రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనని స్పష్టంగా తెలుస్తోందని, దీనిని కొనసాగించడం సమర్ధనీయం కాదని ధర్మాసనంలోని ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఇందిరా మల్హోత్రా తీర్పునిచ్చారు. ‘మహిళల గౌరవానికి భంగం కలిగించడంతో పాటు దానిని హరిస్తుందని, మహిళల్ని పురుషుల ఆస్తిగా పరిగణిస్తూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంది’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ స్పష్టం చేశారు. వైవాహిక జీవితంలో అసంతృప్తికి వివాహేతర సంబంధాలు కారణం కాదని, వైవాహిక జీవితంలో అసంతృప్తి వల్లే ఇలాంటి సంబంధాలు తలెత్తుతున్నాయని జస్టిస్‌ మిశ్రా పేర్కొన్నారు. సమానత్వం అనేది రాజ్యాంగంలోని ప్రధాన అంశమని.. అయితే ఐపీసీలోని సెక్షన్‌ 497 మహిళల్ని పరిగణించే విధానం నిరంకుశత్వమని అన్నారు.  

వైవాహిక వ్యవస్థ పవిత్రతకు దెబ్బ..  
ఈ కేసులో వాదనలు వినిపించిన ప్రభుత్వం.. ఈ చట్టంలో సవరణలు చేస్తే వైవాహిక వ్యవస్థ పవిత్రత దెబ్బతింటుందని, అది సమాజంపై చెడుభావం చూపిస్తుందని సుప్రీంకోర్టుకు తెలిపింది. కాగా తీర్పును స్వాగతిస్తూ.. 497 సెక్షన్‌ను ఎప్పుడో తొలగించాల్సిందని నేషనల్‌ కమిషన్‌ ఆఫ్‌ ఉమెన్‌ చీఫ్‌ రేఖా శర్మ అన్నారు. ‘ఇది బ్రిటిష్‌ కాలం నాటి చట్టం.. బ్రిటన్‌ దీనిని ఎప్పుడో రద్దు చేసినా.. మనం మాత్రం కొనసాగించాం’ అని పేర్కొన్నారు. మహిళలను పురుషుల ఆస్తిగా భావించే వారి విషయంలో వివక్ష చూపుతున్న ఈ సెక్షన్‌ను రద్దు చేయాలని జాతీయ మహిళా కమిషన్‌ గతంలో సిఫారసు చేసింది. పలువురు న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  

తిరోగమన చర్య అవుతుంది: జస్టిస్‌ మిశ్రా
‘వరకట్న వేధింపులు, గృహ హింసతో పోలిస్తే వివాహేతర సంబంధం పూర్తిగా భిన్నమైనది. వివాహేతర సంబంధాన్ని నేరంగా భావిస్తే...అప్పటికే వైవాహిక జీవితం పట్ల సంతృప్తిగా లేని వారికి మరింత శిక్ష విధించినట్లవుతుంది. వివాహేతర సంబంధాన్ని నేర కోణంలోనే చూడటం తిరోగమన చర్య అవుతుంది. రాజ్యాంగం, చట్టాల్లో వచ్చిన ఎన్నో మార్పులను కోర్టు చూసింది. వెనక్కి వెళ్తున్న టైమ్‌ మెషిన్‌లో కూర్చుని మరో యుగానికి వెళ్లాలనుకోవడం సరికాదు’

తండ్రితో విభేదించారు
సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తన తండ్రి, మాజీ ప్రధాన న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్‌ గతంలో ఇచ్చిన తీర్పుతో మరోసారి విభేదించారు. వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న సెక్షన్‌ 497ను గతంలో వైవీ చంద్రచూడ్‌ సమర్థించగా, తాజాగా డీవై చంద్రచూడ్‌ తోసిపుచ్చారు. గతేడాది ఆగస్టులో గోప్యతా హక్కు ప్రాథమిక హక్కే అని తీర్పునిస్తూ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తన తండ్రి అభిప్రాయాలను తోసిపుచ్చారు. తాజాగా, వివాహేతర శృంగారం నేరం కాదని తేల్చిన బెంచ్‌లో సభ్యుడైన జస్టిస్‌ డీవై.. 1985 నాటి సౌతి విష్ణు వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో తన తండ్రి ఇచ్చిన తీర్పుతో విభేదించారు. ‘సౌమిత్రి విష్ణు కేసులో.. సెక్షన్‌ 497పై ప్రభావం చూపే రాజ్యంగ పరిధిలోని విషయాలను విస్మరించారు. సమానత్వపు హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు అన్నింటికి మించి లింగ సమానత్వ హక్కు సమాజానికి ఆధారం’ అని డీవై తీర్పులో చెప్పారు.

జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, వైవీ చంద్రచూడ్‌

వివాహేతర సంబంధాలు ఈ దేశాల్లో నేరం..
అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేసియా, ఇరాన్, మాల్దీవులు, నేపాల్, పాక్, ఫిలిప్పైన్స్, యూఏఈ, అల్జీరియా, కాంగో, ఈజిప్టు, మొరాకో, నైజీరియా,  అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు

ఈ దేశాల్లో నేరం కాదు..
చైనా, జపాన్, బ్రెజిల్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా, ఐర్లాండ్, బార్బడోస్, బెర్ముడా, జమైకా, ట్రినిడాడ్‌ అండ్‌ టుబాగో, ద. కొరియా, గ్వాటెమాలా

సెక్షన్‌ 497 ఏం చెబుతోంది..
భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని 497వ సెక్షన్‌ వివాహేతర సంబంధాన్ని శిక్షార్హమైన నేరంగా పేర్కొంటోంది. ‘మరొకరి భార్య అని తెలిసి, ఆ భర్త  అనుమతి లేకుండా ఆమెతో శృంగారం జరపడం అత్యాచార నేరం కాకపోయినా, వివాహేతర సంబంధానికి సంబంధించిన నేరం’ అని ఆ సెక్షన్‌ నిర్వచిస్తోంది. ఆ నేరానికి పురుషుడికి ఐదేళ్ల వరకు జైలుశిక్ష కాని, జరిమానా కాని లేదా రెండూ విధించవచ్చు. ఇలాంటి కేసుల్లో మహిళను శిక్షించడానికి వీల్లేదని సెక్షన్‌ 497 స్పష్టం చేస్తోంది. అయితే, ఈ చట్టం ప్రకారం వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను కాని, భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళనుకాని ప్రాసిక్యూట్‌ చేసే హక్కు భార్యకు లేదు.

‘తప్పుడు’ భర్తలకే ఉపశమనం!
న్యూఢిల్లీ: వివాహేతర సంబంధాలు నేరం కాదన్నసుప్రీం తీర్పు కొందరు తప్పుడు భర్తలకు ఉపశమనం కలిగించగా, కొందరు అమాయకపు భర్తలకు కంటకంగా మారింది. వివాహేతర సంబంధ ఆరోపణలతో భార్య కేసు పెట్టడంతో పుణేకు చెందిన ఐటీ ఉద్యోగి తన పిల్లలకు దూరమయ్యాడు. ఉద్యోగ అవకాశాలు కోల్పోయాడు. న్యాయ ప్రక్రియలో రూ.4 లక్షలు ఖర్చుపెట్టాడు. తన భార్య చేసిన ఆరోపణలు అబద్ధమని, ఇన్నాళ్లూ తాను అనుభవించిన మానసిక క్షోభ నిజమని, కోర్టు తీర్పు ఉపశమనం కలిగించిందని ఆయన అన్నారు. ఇక ఢిల్లీకి చెందిన ఓ వైద్యుడిది కూడా సుమారు ఇలాంటి కథే. తన భార్య వేరే వ్యక్తితో సంబంధం కలిగి ఉందని గుర్తించాక, ఆమెనే అతనిపై వ్యభిచార కేసు పెట్టడం గమనార్హం. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడంతో ఈ ఇద్దరు హర్షం వ్యక్తం చేశారు. తాజా తీర్పుకు ఇది ఒక పార్శ్వమే.

వివాహేతర సంబంధాలపై సుప్రీం తీర్పు తమ జీవితాలను మరింత దుర్భరం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న అమాయకపు భర్తలు కూడా ఉన్నారు. అందులో బెంగళూరుకు చెందిన 45 ఏళ్ల చైతన్య గౌడ ఒకరు. తన భార్య అక్రమ సంబంధంపై ఆయన 8 ఏళ్లుగా ఆధారాలు సేకరిస్తున్నారు. ఆమె విటుడి భార్యతో కేసు పెట్టించాలని యోచిస్తున్నారు. కోర్టు తాజా తీర్పుతో.. ఆ కేసు నిలబడేందుకు అవకాశాల్లేవు. తన లాంటి వారి జీవితాలను ఈ తీర్పు మరింత కుదిపేస్తుందని గౌడ విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీకి చెందిన ఐటీ నిపుణుడు దేవ్‌జ్యోతి దాస్‌(42) కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. తన భార్యకు ఇతరులతో లైంగిక సంబంధాలున్నాయని, అందుకు సంబంధించి రెండేళ్లుగా సేకరిస్తున్న ఆధారాలు బూడిదలో పోసిన పన్నీరు అయిందని ఆయన వాపోయారు. సుప్రీంకోర్టు తీర్పును మహిళా సాధికారత కోణంలోనే చూస్తున్నారని, కుటుంబ సాధికారత అనే మరో అంశం కూడా ఉందని సేవ్‌ ది ఫ్యామిలీ అనే ఎన్‌జీవో అధ్యక్షుడు రాజేశ్‌ వాకారియా అన్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top