ఆ ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం కావు: సుమలతా అంబీరీశ్‌

Sumalatha Ambareesh Fires On JDS Leaders - Sakshi

మండ్య: వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా తమను రెచ్చగొట్టి లబ్ది పొందాలని చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం కావంటూ సుమలత తమపై తరచూ విమర్శలు చేస్తున్న జేడీఎస్‌ నేతలకు సమాధానమిచ్చారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... రాజకీయాల్లో ఉన్నపుడు ప్రజాప్రతినిధులు తాము మాట్లాడే ప్రతీ మాటను ఆచితూచి మాట్లాడాలని ఎన్నికల్లో గెలుపు కోసం ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే వారికే చేటని అటువంటి వ్యాఖ్యలు వారి అసలు నైజాన్ని బహిర్గతం చేస్తాయన్నారు. ప్రత్యర్థులు ఎటువంటి విమర్శలు చేసినా అంబరీశ్‌ లెక్క చేసేవారు కాదని తాము కూడా విమర్శల విషయంలో అంబరీశ్‌ను అనుసరిస్తున్నామన్నారు. మహిళలతో సంస్కారవంతంగా నడుచుకోవడం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలనే విషయాన్ని ప్రజాప్రతినిధులు గుర్తుంచుకోవాలంటూ ఘాటుగా స్పందించారు. చిత్రనటులు సుదీప్, దర్శన్, యశ్‌లు తమ కుటుంబానికి అత్యంత ఆత్మీయులని తమ కుటుంబం దుఃఖంలో ఉన్న సమయంలో ముగ్గురు తమకు తోడుగా నిలిచారన్నారు..

అంబి–తమ్మణ్ణ కుటుంబాల మధ్య మాటల యుద్ధం..
మండ్య నియోజకవర్గం నుంచి సుమలత–నిఖిల్‌ కుమారస్వామి దాదాపుగా ప్రత్యర్థులుగా బరిలో దిగనుండడం ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో అంబరీశ్‌–మంత్రి తమ్మణ్ణ కుటుంబాల మధ్య మాటల సమరం మొదలైంది. మంత్రి తమ్మణ్ణ తమపై చేసిన విమర్శలపై స్పందిస్తూ..రాజకీయాల్లో గెలుపోటములు అత్యంత సహజమని రాజకీయాల్లో ఉన్నపుడు రాజకీయపరమైన విమర్శలు చేయాలే కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం మీకు గౌరవమనిపించుకోదంటూ అంబరీశ్‌ కుటుంబ సభ్యులు బదులిచ్చారు. మీకు వయసు పైబడిందనే విషయాన్ని గుర్తుంచుకొని సహనం పాటించాలంటూ తమ్మణ్ణకు ఘాటుగా బదులిచ్చారు. మనమంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లమని దీన్ని దృష్టిలో పెట్టుకొని తమ్మణ్ణ ప్రవర్తించాలంటూ అంబరీశ్‌ తమ్ముడి కొడుకు అమర్‌ మంత్రి తమ్మణ్ణకు సూచించారు. ఎన్ని ఆరోపణలు చేసినా మండ్య జిల్లా ప్రజలు తమ వదిన సుమలతకే మద్దతుగా నిలవనున్నారంటూ ఫేస్‌బుక్‌లో స్పష్టం చేశారు.  

బీజేపీ నేతతో సుమలత సమావేశం..
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సుమలత గురువారం రాత్రి స్థానిక బీజేపీ నేత శివలింగయ్య ఇంట్లో శివలింగయ్యతో దాదాపు గంటసేపు సమావేశమై మంతనాలు జరిపారు. సుమలతకు కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఇచ్చే విషయంలో సందిగ్థత నెలకోవడంతో సుమలత దాదాపుగా స్వతంత్ర అభ్యర్థిగా దిగడం ఖాయంగా కనినిస్తోంది. ఈ నేపథ్యంలో మండ్య నుంచి అభ్యర్థిని నిలపని బీజేపీ సు మలతకు మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకుంది. సుమలత అంగీకరిస్తే బీజేపీలోకి ఆహ్వానించి బీజేపీ తరపున మండ్య నుంచి అభ్యర్థిగా బరిలో దింపడానికి బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో సుమలత,స్థానిక బీజేపీ నేత శివలింగయ్య ఇంట్లో రహస్యంగా మంతనాలు జరపడం ఉత్కంఠ కలిగిస్తోంది. ఇక అంబరీశ్‌ ఉన్న సమయంలో ఇంటికి వెళ్లిన ఏఒక్కరికీ సుమలత కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదంటూ మంత్రి డీసీ తమ్మణ్ణ ఆరోపించిన నేపథ్యంలో సుమలత మద్దతుదారులు అంబరీశ్‌ కుటుంబంతో కలసి మంత్రి డీసీ తమ్మణ్ణ కలసి దిగిన ఫోటోలు షేర్‌ చేసి మంత్రి తమ్మణ్ణకు కౌంటర్‌ ఇచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top