
న్యూఢిల్లీ: అత్యంత ప్రముఖుల వ్యక్తిగత భద్రత బాధ్యతలు చేపట్టే నేషనల్ సెక్యూరిటీ గార్డు(ఎన్‌ఎస్‌జీ) డైరెక్టర్ జనరల్(డీజీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సుదీప్ లఖ్టాకియా నియమితులయ్యారు. ఈయన నియామకాన్ని ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షతన ఉన్న క్యాబినెట్ నియామకాల కమిటీ శుక్రవారం ఆమోదించింది.
ప్రస్తుతం ఎన్‌ఎస్‌జీ డీజీగా ఉన్న ఎస్‌పీ సింగ్ ఈనెల 31వ తేదీన పదవీ విరమణ చేయనుండగా కేంద్రం తాజా నియామకం చేపట్టింది. 1984 బ్యాచ్ తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన లఖ్టాకియా ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్ స్పెషల్ డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన ఈ ఏడాది జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు.‘బ్లాక్ క్యాట్స్’ గా పిలిచే ఎన్‌ఎస్‌జీ గుర్‌గావ్‌లోని మనేసర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది.