నడిరోడ్లపై నిలబడి ఉన్నారు.. ఆదుకోండి: సోనియా

Sonia Gandhi Says Center Acted Misery Way On Their Covid 19 Suggestions - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కల్లోలంతో దిక్కుతోచని స్థితిలో పడిన వలస కూలీలకు ఆహార భద్రత కల్పించాలని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని.. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఆ కుటుంబాలకు  7500 రూపాయలు అందించాలని విజ్ఞప్తి చేశారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో పనిచేసే వారు పని దొరకక ఇబ్బంది పడుతున్నారని.. ఈ పరిశ్రమలు తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. ఇక కరోనా కట్టడిలో అతి ముఖ్య అంశమైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్న కాంగ్రెస్‌ పార్టీ సూచనను కేంద్రం పట్టించుకోవడం లేదని సోనియా విమర్శించారు. కరోనా సంక్షోభం కారణంగా తలెత్తిన తాజా పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ గురువారం సమావేశమైంది. (అమ్మో అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ....)

ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ.. దేశంలో కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కిట్లు నాసికరంగా ఉండటంతో కచ్చితమైన ఫలితాలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. చాలా రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ టెస్టు కిట్ల కొరత ఉందని పేర్కొన్నారు. అదే విధంగా లాక్‌డౌన్‌ కారణంగా ముఖ్యంగా రైతులు, కార్మికులు, వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఉపాధి లేక, సొంత ప్రాంతాలకు వెళ్లలేక వలస కార్మికులు దిక్కుతోచని స్థితిలో నడి రోడ్లపై నిలబడి ఉన్నారని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఆహార భద్రత, ఆర్ధిక పరమైన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశంలో వ్యాపారం, వాణిజ్యం , పారిశ్రామిక రంగాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని.. సమస్యలు అధిగమించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.(లాక్‌డౌన్‌‌: గంగా నీరు తాగొచ్చు!)

కాగా కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో సోనియా గాంధీ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ వల్ల్ల ఎవరూ ఆకలితో ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా చూసుకోవాలని ప్రధానిని కోరారు. తక్కువ ధరకు ధాన్యం అందించే కేంద్రం నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు. అయితే దీర్ఘకాలిక ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పథకాన్ని సెప్టెంబర్‌ వరకూ పొడిగించాలని సూచించారు. అదే విధంగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితులపై సమాలోచనలు చేయడం సహా వాటిపై పార్టీ వైఖరిని వెల్లడించేందుకు మాజీ ప్రధాని మనోహ్మన్‌ సింగ్‌ చైర్మన్‌గా ఓ సంప్రదింపుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top