ఆమె చేతుల రంగు మారింది!

Shreya Siddanagowda Transplanted Man Hands Changed Colour - Sakshi

కొచ్చి: ఆసియాలోనే తొలిసారిగా ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ద్వారా ఓ యువతికి అతికించిన ఓ యువకుడి రెండు చేతుల రంగు మూడేళ్ల తర్వాత ఆమె చర్మం రంగులోకి మారింది. శ్రేయా సిద్ధనగౌడ చేతుల చర్మపు రంగు ఆమె శరీరం రంగు మాదిరిగా మారిపోయిందని డాక్టర్లు తెలిపారు. అయితే ఇందుకు శాస్త్రీయ కారణాలు వివరించడం కష్టమని పేర్కొన్నారు. కొచ్చిలోని అమృత ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో 2017లో దాదాపు 13 గంటల పాటు శ్రమించి బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఓ యువకుడి చేతులను శ్రేయకు డాక్టర్లు అతికించారు. ఇంతకాలానికి అతడి చేతుల బరువు తగ్గిపోయి.. శ్రేయ సొంత చేతుల మాదిరిగానే మారిపోయాయి. అంతేకాదు చేతులపై వెంట్రుకలు కూడా చాలావరకు తగ్గిపోయాయి.

బైక్‌ యాక్సిడెంట్‌లో తలకు బలమైన గాయాలు తగలడంతో సచిన్‌ అనే 20 ఏళ్ల కుర్రాడికి బ్రెయిన్‌ డెడ్‌ అయింది. అతడి చేతులను దానం చేసేందుకు సచిన్‌ తల్లిదండ్రులు ముందుకొచ్చారు. దీంతో అమృతా ఆస్పత్రి తల, మెడ సర్జరీ విభాగం హెడ్‌ డాక్టర్‌ కె.సుబ్రమణియ అయ్యర్‌ ఆధ్వర్యంలో 20 మంది సర్జన్లు సహా 36 మందితో కూడిన బృందం శ్రేయకు ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేశారు. ఆమె చేతుల రంగు మారేందుకు స్త్రీ హార్మోన్లు ప్రభావితం చేసి ఉండకపోవచ్చని డాక్టర్లు భావిస్తున్నారు. ‘చర్మం రంగు విషయంలో స్త్రీ హార్మోన్లు ఎలాంటి ప్రభావం చూపవు. కేవలం మెలనిన్‌ మాత్రమే ఆ పని చేస్తుంది. మెదడు ఉత్పత్తి చేసే మెలనోసైట్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ నియంత్రిస్తుంటుంది. ఈ హార్మోన్‌ స్థాయుల ద్వారానే ఆ రంగు మారి ఉంటుంది’ అని అయ్యర్‌ వివరించారు.

చేతులపై వెంట్రుకలు క్రమంగా తగ్గిపోవడానికి కారణం టెస్టోస్టిరాన్‌ హోర్మన్‌ లేకపోవడమేనని ఢిల్లీకి చెందిన ప్రముఖ డెర్మటాలిస్ట్‌ షెహ్లా అగర్వాల్‌ వెల్లడించారు. చేతులు దానం చేసిన యువకుడు శ్రేయ కం‍టే సమయం ఎండలో గడపడం వల్లే అతడి చేతులు ముదురు రంగులోకి మారాయని తెలిపారు. శ్రేయకు అతికించిన తర్వాత అతడి చేతులు లేత వర్ణంలోకి మారాయని అభిప్రాయపడ్డారు. (చదవండి: కరోనా తొలి బాధితుడి అనుభవాలు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top