
న్యూఢిల్లీ: డీఆర్‌డీఓ (రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి సంస్థ) చైర్మన్‌గా ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త, తెలుగు తేజం జి.సతీశ్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని అధికారిక ప్రకటనలో డీఆర్‌డీఓ వెల్లడించింది. ఆయన రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి విభాగానికి కూడా కార్యదర్శిగా పనిచేస్తారు. 1985లో డీఆర్‌డీఓలో తన ప్రస్థానం ప్రారంభించిన సతీశ్‌రెడ్డి 1986–94 మధ్యకాలంలో క్షిపణి నేవిగేషన్(దిక్సూచి) వ్యవస్థలో అనేక మైలురాళ్లను ఆధిగమించారు. శాస్త్ర సలహాదారుగా, క్షిపణి వ్యవస్థలు, గైడెడ్ వెపన్స్, ఎవియానిక్స్ టెక్నాలజీలు, దేశంలోని ఎయిరోస్పేస్ టెక్నాలజీ, పరిశ్రమల అభ్యున్నతికి సతీశ్ రెడ్డి ఎంతో కృషి చేశారు. ఇంతవరకూ ఆయన రక్షణ శాఖ మంత్రి శాస్త్ర సలహాదారుగా పనిచేశారు.