శబరిమల ప్రసాదానికి కొత్త రూపు

Sabarimala Prasadam To Get Makeover With CFTRI Touch  - Sakshi

సాక్షి, తిరువనంతపురం : అయ్యప్పస్వామి ఆలయం శబరిమల ప్రసాదంలో భక్తులకు ఇచ్చే అప్పం, అరవణలో మార్పు చేర్పులు చేపట్టనున్నారు. తిరుపతి వెంకన్న, పళనిలోని మురగ ఆలయ ప్రసాదాలైన లడ్డు, పంచామృతాల తయారీలో సూచనలు చేస్తున్న సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌ (సీఎఫ్‌టీఆర్‌ఐ) శబరిమల ఆలయ ప్రసాదానికీ మెరుగులుదిద్దనుంది. ప్రసాదంగా అందించే అప్పం, అరవణలకు కొత్త రుచి, నాణ్యతలను మేళవించేందుకు ఆలయ యాజమాన్యం ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) సీఎఫ్‌టీఆర్‌ఐతో ఒప్పందం చేసుకుంది.

శబరిమల ఆలయానికి ఏటా నవంబర్‌ నుంచి జనవరి సీజన్‌లో దేశ విదేశాల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తారు. మే 15న నెలవారీ పూజ కోసం ఆలయాన్ని తెరుస్తామని..ఆ మరుసటి రోజే ప్రసాదంలో మార్పు చేర్పుల కోసం సీఎఫ్‌టీఆర్‌ఐతో ఆలయ బోర్డు ఎంఓయూ చేసుకుంటుందని టీడీబీ అధ్యక్షుడు ఏ పద్మకుమార్‌ తెలిపారు. ప్రసాదం తయారీలో నిమగ్నమయ్యే ఆలయ సిబ్బందికి సీఎఫ్‌ఐఆర్‌ఐ బృందం శిక్షణ ఇస్తుందని చెప్పారు. అన్నీ సజావుగా సాగితే తదుపరి సీజన్‌ నుంచే భక్తులకు అప్పం, అరవణ ప్రసాదాలు సరికొత్త రుచులతో అందుబాటులో ఉంటాయని తెలిపారు.

కాగా ప్రసాదాల ధరలను పెంచే ప్రతిపాదన లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకూ శబరిమల అప్పం గట్టిగా ఉంటోందని, దాన్ని కొంచెం మెత్తగా, తీయగా రూపొందిస్తామని, ఇక అరవణ గట్టిదనాన్ని తగ్గిస్తామని, ఇందులో ఉపయోగించే బెల్లం పరిమాణం కూడా 30-40 శాతం తగ్గుతుందని చెప్పారు. సీఎఫ్‌టీఆర్‌ఐ నిపుణుల పర్యవేక్షణలో ప్రసాదాల తయారీ ఏర్పాట్లు, ప్యాకింగ్‌ పద్ధతుల్లో మార్పుచేర్పులు చోటుచేసుకుంటాయన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top