యాత్రికుల పరిస్థితి సమీక్షిస్తున్నాం: రెసిడెంట్‌ కమిషనర్‌

Resident Commissioner Praveen Kumar Talk About Pilgrims - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: యాత్రికుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. ఆయన మంగళవారం ఉదయం సాక్షి టీవీతో మాట్లాడుతూ.. నిన్నటి నుంచి నేపాల్లోని భారత రాయబార కార్యాలయ అధికారులు, ఢిల్లీలోని కేంద్ర అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు మూడు క్యాంపుల్లో కలిపి సుమారు 1500మంది చిక్కుకున్నట్లు సమాచారమని వెల్లడించారు. సిమికోట్‌లో 550, హిల్సాలో 500 మంది, టిబెట్‌ వైపున 500 మంది చిక్కుకున్నారని, వారిలో మన తెలుగు వాళ్ళు సుమారు 100మంది ఉన్నారన్నారని తెలిపారు. 

యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.. 
యాత్రికులను సురక్షత ప్రాంతాలకు తరలించాలని అధికారులను కోరామని ప్రవీణ్ కుమార్‌ తెలిపారు. బేస్ క్యాంపుల్లో ఇప్పటికీ వర్షం పడుతూనే ఉందన్నారు. దీంతో హెలికాప్టర్ల ద్వారా మాత్రమే సహాయం అందించాల్సిన పరిస్థితి నెలకొంది. హెలీకాప్టర్ల సహాయంతో యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా విజ్ఞప్తి చేశామన్నారు. అదేవిధంగా సహాక చర్యలకోసం భారత ఆర్మీని కూడా పంపించాలని విదేశాంగశాఖను కోరామని తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూనే తెలుగు వాళ్ళందరూ సురక్షితంగా స్వస్థలాలకు చేరుకొనేలా చూస్తామన్నారు.

స్పందించిన తెలంగాణ అధికారులు
కాగా, మానస్ సరోవర్ యాత్రలో చిక్కుకున్న తెలంగాణ యాత్రికులతో ఢిల్లీ తెలంగాణ భవన్ అధికారులు ఫోన్‌లో మాట్లాడారు. తామంతా సురక్షితంగా ఉన్నట్టు అధికారులకు యాత్రికులు తెలిపారు. యాత్రికులకు కావాల్సిన వైద్యం తక్షణమే అందించాలని సంబంధిత అధికారులను కోరినట్లు తెలంగాణ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top