‘పుల్వామా’తో ఏకతాటిపైకి ప్రపంచం

Rajnath Singh Inaugurated NIA Office In Hyderabad - Sakshi

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

ఉగ్రవాదంపై నిర్ణయాత్మక పోరుకు సమయమిదే

హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ కార్యాలయ ప్రారంభోత్సవం

92 శాతం కేసుల్లో ఎన్‌ఐఏ నేర నిర్ధారణ చేసిందని వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: పుల్వామా ఉగ్ర దాడి యావత్‌ ప్రపంచాన్ని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకం చేసిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఉగ్రవాదంపై నిర్ణయాత్మకమైన పోరు జరగాల్సిన సమయం ఇదేనని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో రూ. 37 కోట్లతో నిర్మించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నూతన భవనాన్ని, నివాస సముదాయాలను రాజ్‌నాథ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఉగ్రవాదంపై అంతిమ యుద్ధం మన గడ్డపైనే మొదలు కావాలి. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ పుల్వామా ఉగ్ర దాడి తరువాత అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. పుల్వామా దాడిలో 40 మంది సీఆర్‌ర్పీఎఫ్‌ జవాన్లు మరణించారు.

గతంలోనూ ఇలాంటి ఉగ్ర దాడులు జరిగినప్పటికీ తాజా ఘటన మాత్రం ప్రపంచ దేశాలను ఉగ్రవాదంపై గట్టిగా తిరగబడేందుకు సిద్ధం చేసింది. ఉగ్రవాద సంస్థలకు అనేక మార్గాల ద్వారా అందుతున్న నిధులను అడ్డుకోగలిగితే సమస్య సమసిపోతుంది. ఈ అంశంలో ఇప్పుడు ఇస్లామిక్‌ దేశాలు కూడా భారత్‌కు మద్దతు పలుకుతున్నాయి’అని చెప్పారు. ఎన్‌ఐఏ తీసుకున్న అనేక చర్యల వల్ల ఉగ్రవాదులకు అందుతున్న నిధులు గణనీయంగా తగ్గిపోయాయని, దొంగ నోట్ల చెలామణి కూడా తగ్గిపోయిందన్నారు. ఎన్‌ఐఏ 92 శాతం కేసుల్లో నేరాలు రుజువు చేసి శిక్ష వేయించగలిగిందని అభినందించారు. ఉగ్రవాదానికి సంబంధించిన సాక్ష్యాలను సేకరించేందుకు ఎన్‌ఐఏ విదేశీ సంస్థల సహకారం కూడా తీసుకుంటోందని చెప్పారు.

వైఖరి మారుతోంది...  
ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కాన్ఫరెన్స్‌ లాంటివి తొలిసారి భారత విదేశాంగ మంత్రిని వారి సదస్సుకు ఆహ్వానించడం స్వాగతించదగ్గ పరిణామమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి కులమతాలేవీ ఉండవని.. కొందరు మతానికి, ఉగ్రవాదానికి ముడిపెట్టడం ఏమాత్రం సరికాదన్నారు. పుల్వామా దాడి తరువాత భారతీయులందరూ కులమతాలకు అతీతంగా తమ ఆవేదనను వ్యక్తం చేశారన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థలను బలోపేతం చేసేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని.. ఇందులో భాగంగా ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌)పై ప్రత్యేక పరిశోధన విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చామని రాజ్‌నాథ్‌ తెలిపారు. అంతేకాకుండా కేసుల దర్యాప్తును వేగవంతం చేసేందుకు 100 పోస్టులు సిద్ధం చేశామన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top