చరిత్ర సృష్టించిన వయనాడ్‌ యువతి

Rahul Gandhi congratulates Sreedhanya Suresh - Sakshi

కేరళ నుంచి సివిల్స్‌ సాధించిన తొలి గిరిజన మహిళగా గుర్తింపు

అభినందించిన రాహుల్‌ గాంధీ

తిరువనంతపురం: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కేరళ నుంచి పోటీచేస్తున్న వయనాడ్‌కు చెందిన గిరిజన యువతి శ్రీధన్య సురేశ్‌ సివిల్స్‌లో ర్యాంకు తెచ్చుకున్నారు. కేరళ నుంచి ఈ ప్రతిష్టాత్మక సర్వీసుకు ఎంపికైన తొలి గిరిజన యువతిగా ఆమె గుర్తింపు పొందారు. శుక్రవారం యూపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో 22 ఏళ్ల శ్రీధన్యకు 410వ ర్యాంక్‌ దక్కింది. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ‘ శ్రీధన్య కష్టపడేతత్వం, అంకితభావం ఆమెకు సివిల్స్‌ ర్యాంకు తెచ్చిపెట్టాయి. ఆమె ఎంచుకున్న రంగంలో విజయవంతం కావాలని కోరుకుంటున్నా’ అని రాహుల్‌ అన్నారు. కేరళ ముఖ్యమంత్రి పి.విజయన్‌ ఆమెతో ఫోన్‌లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌లో ‘ తన సామాజిక వెనకబాటుతో పోరాడి శ్రీధన్య సివిల్స్‌లో మెరిశారు. ఆమె విజయం భవిష్యత్తులో ఇతరులకు స్ఫూర్తినిస్తుంది’ అని పేర్కొన్నారు.

కానిస్టేబుల్‌ ఉద్యోగం వద్దనుకుని..
వయనాడ్‌లోని పోజుతానాకు చెందిన శ్రీధన్య మూడో ప్రయత్నంలో విజయం సాధించారు. గతంలో పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం వచ్చినా వదిలేసింది. కేరళ గిరిజన విభాగంలో ప్రాజెక్టు అసిస్టెంట్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. ‘అత్యంత వెనకబడిన జిల్లా నుంచి వచ్చాను. ఇక్కడ గిరిజన జనాభా చాలా ఉన్నా మా నుంచి ఒక్కరూ ఐఏఎస్‌కు ఎంపిక కాలేదు. నా విజయం భావి తరాలకు స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నా. నా పీజీ పూర్తయిన తరువాత తొలిసారి ఓ ఐఏఎస్‌ అధికారిని ప్రత్యక్షంగా చూశా. ఆయన కోసం ప్రజలు ఎదురుచూడటం, సిబ్బందితో ఆయన అక్కడికి రావడం సివిల్స్‌ సాధించాలన్న నా చిన్న నాటి కలను తట్టిలేపాయి’ అని శ్రీధన్య గుర్తుకుచేసుకున్నారు. ఆమె కాలికట్‌ విశ్వవిద్యాలయంలో అప్లయిడ్‌ జువాలజీలో పీజీ చదివారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top