రీస్టార్ట్‌కి రెడీ అవుదాం

PM Narendra Modi to interact with Chief Ministers with focus on economy - Sakshi

త్వరలో ఊపందుకోనున్న ఆర్థిక రంగం

సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ

సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆర్థిక సాయం కోరిన ముఖ్యమంత్రులు

లాక్‌డౌన్‌ను పొడిగించాలన్న పలువురు సీఎంలు

న్యూఢిల్లీ: కరోనా, లాక్‌డౌన్‌లతో దారుణంగా దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం సాయం అందించాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభ్యర్థించారు. తమ రాష్ట్రాల్లో జోన్‌లను నిర్ధారించే అధికారం తమకే ఉండాలని కోరారు. కరోనా నియంత్రణ, లాక్‌డౌన్‌ నిర్వహణ, ఆర్థిక రంగ ఉద్దీపన సహా పలు అంశాలపై సోమవారం ప్రధాని మోదీ రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయా అంశాలపై వారి అభిప్రాయాలను తెల్సుకున్నారు. కరోనా మహమ్మారిపై పోరుకు సంబంధించి భవిష్యత్‌ కార్యాచరణ విషయంలో సమతుల వ్యూహం అవసరమని సీఎంలతో భేటీలో వ్యాఖ్యానించారు. రాష్ట్రాలు ఇచ్చే సూచనల ఆధారంగానే ఆ వ్యూహం రూపొందుతుందన్నారు.  లాక్‌డౌన్‌కు సంబంధించి తమ సమగ్ర వ్యూహాలను మే 15 లోగా పంపించాలని ముఖ్యమంత్రులను ప్రధాని కోరారు.

గ్రామాలకు విస్తరించవద్దు
కరోనా నుంచి భారత్‌ విజయవంతంగా బయటపడిందన్న భావనలో ప్రపంచం ఉందని మోదీ అన్నారు. ఈ విజయంలో రాష్ట్రాలు నిర్ణయాత్మక పాత్ర పోషించాయని ప్రశంసించారు. కరోనా గ్రామాలకు వ్యాపించకుండా చూడడం అతి పెద్ద సవాలన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలను సరిగా పాటించని ప్రాంతాల్లోనే కరోనా వ్యాప్తి చెంది, సమస్యాత్మకంగా మారాయన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఎక్కడున్న వారు అక్కడే ఉంటే మంచిదని, కష్ట సమయంలో తమ వాళ్లతో ఉండాలనుకుంటారు కనుక తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. వ్యాప్తిని తగ్గించే దిశగా దృష్టి పెట్టాలని, ప్రజలు ‘రెండు గజాల దూరం’సహా అన్ని నిబంధనలను పాటించేలా చూడాలని పీఎం కోరారు. ఏ ప్రాంతాల్లో వైరస్‌ ప్రభావ తీవ్రంగా ఉంది, ఏ ప్రాంతాల్లో వ్యాప్తి చెందే అవకాశాలున్నాయనే విషయంలో స్పష్టమైన సమాచారం కేంద్రం వద్ద ఉందన్నారు. వైరస్‌ను నియంత్రించేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందన్నారు.

ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభం
దాదాపు ఆరు గంటల పాటు పీఎం–సీఎంల కాన్ఫరెన్స్‌ కొనసాగింది. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోనున్నాయని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. ఆర్థిక కార్యకలాపాలను పూర్తి స్థాయిలో పునఃప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో వలస కార్మికులు తమ గ్రామాలకు వెళ్లిపోతున్న పరిస్థితుల్లో పారిశ్రామిక కార్యకలాపాల పునరుద్ధరణ ప్రస్తుతం సమస్యగా మారిన అంశం భేటీలో చర్చకు వచ్చింది. అందరు ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకున్న తరువాతనే లాక్‌డౌన్‌ను ఎత్తివేయడమా? లేక కొనసాగించడమా? అనే విషయంపై నిర్ణయం తీసుకోవాలనుకున్నట్లు సీఎంలతో వ్యాఖ్యానించారు.  

హోం, ఫైనాన్స్, డిఫెన్స్‌ మంత్రులూ..  
భేటీలో హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి(ఆంధ్రప్రదేశ్‌), చంద్రశేఖర రావు(తెలంగాణ), ఉద్ధవ్‌ ఠాక్రే(మహారాష్ట్ర) తదితరులు భేటీలో పాలు పంచుకున్నారు. కరోనాకి సంబంధించి పీఎం– సీఎంల మధ్య ఇది ఐదవ వీడియో కాన్ఫరెన్స్‌. ఈ భేటీలో దాదాపు సీఎంలందరికీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం లభించింది.

పొడిగింపునకే మొగ్గు
కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో పలువురు సీఎంలు లాక్‌డౌన్‌ను మరోసారి పొడగించాలని ప్రధానికి సూచించారు. ఈ నెల మొత్తం రైలు, విమాన ప్రయాణాలపై నిషేధం కొనసాగించాలని తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులు ప్రధానిని కోరారు. కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాలను మినహాయించి, దేశ రాజధాని ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించాలని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కోరారు. లాక్‌డౌన్‌ను కొనసాగించాలని అస్సాం, పంజాబ్‌ సహా ఐదు రాష్ట్రాల సీఎంలు కోరారు.

సొంత ప్రాంతాలకు ఆకలిదప్పులకు ఓర్చుకుంటూ కాలినడకన వెళ్తున్న వలస కార్మికుల గురించి మెజారిటీ సీఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో వైరస్‌ ప్రభావం లేని ప్రాంతాల్లో ఎయిర్, రైల్, మెట్రో ప్రయాణాలకు అనుమతించాలని కేరళ సీఎం విజయన్‌ కోరారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఉండాలన్నారు. లాక్‌డౌన్‌ నుంచి వ్యూహాత్మకంగా బయటకు వచ్చే వ్యూహాన్ని జాగ్రత్తగా రూపొందించాల్సి ఉందని పంజాబ్‌ సీఎం అమరిందర్‌ సింగ్‌ కోరారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందించాలన్నారు.

దీదీ సీరియస్‌
కరోనాపై పోరులో పశ్చిమబెంగాల్‌ను అనవసరంగా టార్గెట్‌ చేస్తున్నారని ఆ రాష్ట్ర సీఎం మమత బెనర్జీ ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారని తృణమూల్‌ కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. ‘బెంగాల్‌ను రాజకీయంగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. సంక్షోభం నుంచి బయటపడేందుకు కేంద్రం ఒక స్పష్టమైన వ్యూహంతో ముందుకు రావాలి’ అని మమత డిమాండ్‌ చేశారని తెలిపాయి. ఆ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు.. కోవిడ్‌పై పోరు విషయంలో ప్రస్తుతం అవలంబిస్తున్న విధానంలోని వైరుధ్యాలను ఆమె ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. ఒకవైపు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలంటూనే.. మరోవైపు, మినహాయింపుల పేరుతో రైళ్లను నడపడం, రాష్ట్రాల సరిహద్దులను తెరవడాన్ని ఆమె ఆక్షేపించారు. ఏ రంగాలకు మినహాయింపునివ్వాలన్నది క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా రాష్ట్రాలే నిర్ణయించుకోవడం మంచిదన్నారు. ప్రధాని మొదట మాట్లాడిన సీఎంలలో మమత ఒకరని అధికార వర్గాలు తెలిపాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top