స్వాతంత్య్ర పోరాటయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనుమానాస్పదరీతిలో కనిపించకుండాపోయిన ఘటనకు సంబంధించి రహస్యంగా ఉన్న ఫైళ్లను బహిర్గతపరిచే అధికారం ప్రధానమంత్రికి లేదని ప్రధాని కార్యాలయం (పీఎంఓ) స్పష్టంచేసింది.
కోల్‌కతా: స్వాతంత్య్ర పోరాటయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనుమానాస్పదరీతిలో కనిపించకుండాపోయిన ఘటనకు సంబంధించి రహస్యంగా ఉన్న ఫైళ్లను బహిర్గతపరిచే అధికారం ప్రధానమంత్రికి లేదని ప్రధాని కార్యాలయం (పీఎంఓ) స్పష్టంచేసింది. ప్రజా రికార్డుల నిబంధనలు-1997ప్రకారం రహస్యంగా ఉన్న రికార్డులను బట్టబయలుచేసే ఎలాంటి అధికారం ప్రధానికి దఖలుపడలేదని పేర్కొంది. ఈమేరకు కేరళకు చెందిన శ్రీజిత్ పణికర్ అనే ఐటీ నిపుణుడు సమాచారహక్కు చట్టం కింద దాఖలుచేసిన దరఖాస్తుకు పీఎంఓ బదులిచ్చింది. రహస్య ఫైళ్లను వర్గీకృత జాబితా నుంచి తొలగించి, వాటిని నేషనల్ ఆర్కైవ్స్‌కు తరలించే విశిష్టాధికారం ప్రధానికి ఉందా అని శ్రీజిత్ తన దరఖాస్తులో ప్రశ్నించారు. నేతాజీకి సంబంధించి మొత్తం 41 ఫైళ్లు ఉండగా వాటిలో 5 ఫైళ్లకు సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1) రెడ్‌విత్ 8(2) ప్రకారం బహిర్గతం చేయలేమని పీఎంఓ వెల్లడించింది.