బ్యాన్‌ చేసి.. బొక్క బోర్లాపడ్డ పాక్‌

Pakistan Bans Bollywood Films But Can They Survive Without 70 Per Cent Revenue - Sakshi

న్యూఢిల్లీ: ‘పులిని చూసి నక్క వాత పెట్టుకుంది’ అనే సామెత ప్రస్తుతం పాకిస్తాన్‌కు సరిగ్గా సెట్‌ అవుతుంది. పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా పాక్‌ సినిమాలను, కళాకారులను భారత సినీ పరిశ్రమ, కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా భారత వైమానిక దళం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి.. సుమారు 300మందికి పైగా తీవ్రవాదులను మట్టుబెట్టింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పాక్‌.. భారత్‌కు గుణపాఠం చెప్పాలని భావించి బొక్కబోర్లా పడింది. భారత్‌ పాక్‌ సినిమాలపై నిషేధం విధించినట్టుగానే.. పాక్‌ కూడా బాలీవుడ్‌ సినిమాలపై నిషేధం విధించింది. అయితే నిషేధంతో తమకు ఏమాత్రం నష్టం కలగదని.. కేవలం చిత్రపరిశ్రమకు కాస్త లాభం తగ్గుతుందని బీరాలు పలికింది. అయితే ఈ నిషేధంతో అక్కడి థియేటర్లు, సినీ పరిశ్రమ, ఫిల్మ్‌ మేకర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.

నష్టం భారీగానే..
పాక్‌లోని థియేటర్లు ఎక్కువగా నడిచేవి బాలీవుడ్‌ సినిమాలతోనే.. ఇప్పుడు ఆ సినిమాలపై నిషేధం విధించడంతో సినీ పరిశ్రమపై వచ్చే 70 శాతానికి పైగా ఆదాయాన్ని పాక్‌ కోల్పోతోంది. నిషేధంతో పాత సినిమాలను వేసి థియేటర్లను నడిపిస్తున్నామని.. ప్రేక్షకులు ఎవరూ రాకపోవడంతో దోమలు కొట్టుకుంటూ ఖాళీగా కూర్చుంటున్నామని థియేటర్‌ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమయంలో సినీ వర్గాలు కూడా బాలీవుడ్‌ సినిమాలపై నిషేధం పాక్‌ సినిమా పరిశ్రమకు అంత మంచిది కాదని సూచిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే పాక్‌ సినీ పరిశ్రమ ఎదుగుతుంది.. నిర్మాతలు కూడా సినిమాలు తీయడానికి ముందుకొస్తున్నారు.. ఇలాంటి సమయంలో ఈ నిర్ణయం అక్కడి సినీ వర్గాలకు, ఫిల్మ్‌ మేకర్స్‌కు మింగుడుపడటం లేదు.

భారత్‌కు ఏమాత్రం నష్టం లేదు
పాక్‌ సినిమాలు భారత్‌లో ఆడేవి చాలా తక్కువ. 2018లో కేవలం 21 సినిమాలు మాత్రమే రిలీజ్‌ అయ్యాయి. పాక్‌ దేశవ్యాప్తంగా 129 థియేటర్లు మాత్రమే ఉన్నాయి. అదే భారత్‌లో ఆరు వేల సింగిల్‌ థియేటర్లు, రెండు వేలకు పైగా మల్టీప్లెక్స్‌ థియేటర్‌లు ఉన్నాయి. ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా లెక్కల ప్రకారం 2018లో సుమారు 1813 సినిమాలు విడుదలయ్యాయి. పాక్‌ సినిమాలపై నిషేధంతో ఇక్కడి పరిశ్రమకు ఎంతమాత్రం నష్టం వాటిల్లందని ఫిల్మ్‌ ఫెడరేషన్ పేర్కొంది. ఇప్పటివరకు సల్మాన్‌ ఖాన్‌ ‘సుల్తాన్‌’ .. పాక్‌లో అత్యధికంగా 37 కోట్లు వసూలు చేసి టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 600 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసింది. ఇక గతంలోనూ బాలీవుడ్‌ సినిమాలపై నిషేధం విధించిన పాక్‌.. అక్కడి సినీ పరిశ్రమ దివాలా తీయడంతో నిషేధాన్ని ఎత్తివేసిన విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top