ఆశ్రమం కాదు.. ఆయుధాగారం!

ఆశ్రమం కాదు.. ఆయుధాగారం!


చండీగఢ్: హర్యానాలోని హిస్సార్ జిల్లా, బల్వారాలో ఉన్న వివాదాస్పద స్వామీజీ రాంపాల్ ఆశ్రమం ఆధ్యాత్మతకు కాకుండా ఆయుధాలకు నిలయంగా కనిపిస్తోంది. రాంపాల్ అరెస్ట్ అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) జరుపుతున్న సోదాల్లో భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి బయటపడింది. వాటితో పాటు పెట్రోల్ బాంబులు, యాసిడ్ సిరంజీలు, చిల్లీ గ్రెనేడ్‌లు కుప్పలుగా కనిపించాయి.



రాంపాల్ గది పక్కనే ఉన్న మరో గదిలో గర్భ నిర్ధారణ పరికరం కూడా కనిపించింది. ఆశ్రమంలో మూడు .32 బోర్ రివాల్వర్లు, 19 ఎయిర్ గన్లు, 4 రైఫిళ్లు, వివిధ తుపాకులకు వినియోగించే 100కు పైగా క్యాట్రిడ్జ్‌లు లభించాయి. చాలావరకు ఆయుధాలను రెండు ప్రత్యేక గదుల్లోని బీరువాల్లో దాచారు. మందుగుండు సామగ్రిని మాత్రం ఎవరికీ అనుమానం రాకుండా ఆశ్రమం మధ్యలో ఒక వేదికలాంటి దాన్ని నిర్మించి దానిలోపల దాచిపెట్టారు.



ఆ వేదికపై స్వామీజీ ఆసనం ఉండటం వల్ల ఎవరి దృష్టి దానిపై పడదని వారు భావించి ఉంటారని పోలీసులు తెలిపారు. ఆశయం చుట్లూ 50 అడుగుల ఎత్తై ప్రహారీ గోడ, ఆ ప్రహారీ మధ్యలో అక్కడక్కడా వాచ్ టవర్లు, లోపలికి వచ్చేవారిని పరీక్షించేందుకు మెటల్ డిటెక్టర్లు, ఆశ్రమం అంతటా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆశ్రమంలో భారీ స్విమింగ్‌పూల్, 24 ఏసీ గదులు, అందులో స్వామీజీ కోసం ప్రత్యేకంగా మసాజ్ రూం కూడా ఉంది.



800 లీటర్ల డీజిల్, భారీ సంఖ్యలో కర్రలు, హెల్మెట్లు, నల్లరంగు దుస్తులు కూడా లభించాయి. లక్షమందికి నెల రోజుల పాటు భోజనం సమకూర్చగల స్థాయిలో ఆహార నిల్వలు కూడా ఉన్నాయి. 1000 బ్రెడ్‌లను ఒకేసారి తయారుచేయగల మెషీన్ కూడా ఉంది.  మొత్తం ఆశ్రమాన్ని సోదా చేసేందుకు మరో రెండు, మూడు రోజులు పడుతుందని సిట్ ప్రతినిధి తెలిపారు.



50 వేల మంది కూర్చోగల ప్రార్థనామందిరంలో ప్రవచనాలు ఇచ్చేందుకు స్వామీజీ కోసం ప్రత్యేకంగా హైడ్రాలిక్ కుర్చీ, దాని చుట్టూ బుల్లెట్‌ప్రూఫ్ ఎన్‌క్లోజర్ ఉంది. తనిఖీల సందర్భంగా.. స్నానాల గదిలో అపస్మారక స్థితిలో ఉన్న మహిళను రక్షించి పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆశ్రమంలో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top