భారత్‌ ఏకచత్రాధిపత్యానికి తెర

Nepal Picks China For buliding Cyber Network - Sakshi

కఠ్మాండు : దేశ పౌరులకు అంతర్జాల సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు హిమాలయ దేశం నేపాల్‌ చైనాతో చేతులు కలిపింది. దీంతో గత దశాబ్దంగా నేపాల్‌ సైబర్‌ కనెక్టివిటీపై భారత్‌ ఏకచత్రాధిపత్యానికి తెర పడింది. ఇప్పటివరకూ భారతీ ఎయిర్‌టెల్‌, టాటా కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ ద్వారా నేపాల్‌ అంతర్జాల సౌకర్యాన్ని పొందుతూ వచ్చింది.

అయితే, తరచూ నెట్‌వర్క్‌ ఫెయిల్యూర్స్‌ గురవుతుండటం నేపాల్‌ అధికారులకు విసుగొచ్చేలా చేసింది. దీంతో చేసేది లేక ఉత్తమ నెట్‌వర్క్‌ కల్పన కోసం చైనా సాయం కోరినట్లు నేపాల్‌ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. నేపాల్‌ టెలికాం, చైనా టెలికాం గ్లోబల్‌లు కలసి చైనాలోని కెరుంగ్‌ నగరం నుంచి నేపాల్‌లోని రసువగడి వరకూ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

50 కిలోమీటర్ల మేర నిర్మించిన నెట్‌వర్క్‌ను శనివారం ప్రారంభించినట్లు పేర్కొంది. భారత్‌ విఫల సర్వీసులకు చైనా నుంచి ప్రత్యామ్నాయం లభించినట్లు నేపాల్‌ టెలికాం అధికార ప్రతినిధి పేర్కొన్నారని రాయిటర్స్‌ తెలిపింది. రెండు కోట్ల ఎనభై లక్షల జనాభా కలిగిన నేపాల్‌లో ప్రస్తుతం 60 శాతం మందికి ఇంటర్నెట్‌ సర్వీసులు అందుతున్నట్లు పేర్కొంది.

సరిహద్దులో కీలక ప్రాంతంగా ఉన్న నేపాల్‌లో తమ పలుకుబడిని పెంచుకునేందుకు ఏళ్లుగా భారత్‌, చైనాలు ప్రయత్నిస్తున్నాయి. 2016లో పోర్టులను వర్తకానికి ఉపయోగించుకునేందుకు చైనా నేపాల్‌కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. 2017లో నేపాల్‌ చైనా తలపెట్టిన సిల్క్‌ రోడ్డులో చేరేందుకు అంగీకారం కూడా తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top