
అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నారంటూ జాతీయ మీడియా ప్రసారాల్లో ఓ దృశ్యం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చామంటూనే వెల్‌లోకి వెళ్లి తెలుగుదేశం పార్టీ ఆందోళన చేసిందని, ఇలా ఎందుకు నాటకం ఆడుతోందని ఎండగడుతూ ఓ జాతీయ ఛానల్ మంగళవారం కథనాలు ప్రసారం చేసింది. అవిశ్వాస తీర్మానం ఇచ్చినప్పుడు దాన్ని ప్రవేశపెట్టేందుకు వీలుగా సభాపతి సభ్యుల బలాన్ని లెక్కించాల్సి ఉంటుందని, సభ సజావుగా లేనప్పుడు ఈ సంఖ్య లెక్కించడం సాధ్యం కాదని, ఈ సంగతి తెలిసీ టీడీపీ ఎంపీలు వెల్‌లోకి ఎందుకు వెళ్లారంటూ రోజంతా చర్చ నిర్వహించింది. చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ రెండేళ్ల క్రితమే ప్యాకేజీకి అంగీకరించి ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మళ్లీ ప్రత్యేక హోదా అంటూ ఆందోళన చేస్తోందని విశ్లేషించింది. అవిశ్వాసానికి నోటీసులివ్వడం, మళ్లీ అది చేపట్టకుండా వెల్‌లోకి వెళ్లడం టీడీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పేర్కొంది.