
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి నేటికి సరిగ్గా 16 ఏళ్లు. దేశ అత్యున్నత చట్టసభపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమర వీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. 2001 డిసెంబర్ 13న జరిగిన దాడిలో ఐదుగురు ఉగ్రవాదులు, తొమ్మిది మంది భద్రతాసిబ్బంది మృతిచెందిన సంగతి తెలిసిందే. బుధవారం పార్లమెంట్ ఆవరణలో అమరుల ఫొటో వద్ద ప్రధాని మోదీ పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, రవిశంకర్ ప్రసాద్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సుమిత్రా మహజన్, రాహుల్ గాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలు...అమరులకు నివాళులు అర్పించారు.

