'నా చావుకు వారే కారణం..' | 'my death because of politicions' | Sakshi
Sakshi News home page

'నా చావుకు వారే కారణం..'

Aug 23 2016 7:57 PM | Updated on Nov 6 2018 8:04 PM

తన చావుకు మంత్రులే కారణం అని వీడియో రికార్డింగ్ చేసి శివణ్ణ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

బెంగళూరు: తన చావుకు మంత్రులే కారణం అని వీడియో రికార్డింగ్ చేసి శివణ్ణ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడి తాలుకా గవి నాగమంగళ గ్రామంలో చోటుచేసుకుంది. శివణ్ణకు అదే గ్రామంలోని బంధువుల కుటుంబంతో ఆస్తి వివాదం ఉంది. ఈ గొడవల నేపథ్యంలోనే ఇటీవల శివణ్ణ కుటుంబ సభ్యులపై ప్రత్యర్థులు దాడి చేశారు. శివణ్ణ భార్యను నడిరోడ్డు పై వివస్త్రను చేసి అవమానించారు. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. మంత్రుల దృష్టికి తన సమస్యను తీసుకెళ్లినా అక్కడ కూడా ఫలితం లేకుండాపోయింది.

దీంతో మనస్తాపం చెందిన ఆయన విషం తాగాడు. కుటుంబ సభ్యులు అతడిని బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. అంతకుముందు అతడు రికార్డ్ చేసిన వీడియోలో 'నా కుటుంబానికి చెందిన ఆస్తి వివాదాన్ని పరిష్కరించి న్యాయం చేయాల్సిందిగా ఎంతగానో బతిమాలాను. అయినా పోలీసులు నన్ను పట్టించుకోలేదు. ఈ విషయాన్ని అప్పటి మంత్రి కె.జె.జార్జ్‌తో పాటు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ దృష్టికి తీసుకొచ్చినా వారు న్యాయం చేయలేదు. వీరు డీవైఎస్పీ లక్ష్మీగణేష్, స్థానిక పోలీసులు కూడా నా చావుకు కారణం'అని పేర్కొన్నాడు. మరోపక్క, డీజీపీ ఓం ప్రకాష్ కుమారుడు కార్తికేష్ పేరును కూడా శివణ్ణ పేర్కొనడం చర్చకు దారి తీస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement