
26న మెట్రో సేవలకు బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ : గణతంత్ర వేడుకల సందర్భంగా ఈనెల 26న ఢిల్లీ మెట్రో రైలు సర్వీసులకు కొన్ని చోట్ల పాక్షికంగా విఘాతం కలగనుందని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఢిల్లీ పోలీసుల సూచనలకు అనుగుణంగా మెట్రో సేవలను భద్రతా కారణాల దృష్ట్యా పాక్షికంగా నిలిపివేస్తామని మెట్రో రైల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. లైన్ 2లో (హుడా సిటీ సెంటర్ -సమయ్‌పూర్ బద్లి) లైన్ 6లో (కశ్మీరీ గేట్-రాజ నహర్ సింగ్) రూట్లలో స్వల్ప మార్పులు చేశామని వెల్లడించింది.
ఆయా రూట్లలో పలు మెట్రో స్టేషన్లను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మూసివేయనున్నట్టు తెలిపింది. ఇక పటేల్ చౌక్, లోక్‌కళ్యాణ్ మార్గ్ మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను ఉదయం 8.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మూసివేయనున్నట్టు వెల్లడించింది. కాగా మెట్రో పార్కింగ్ సదుపాయాలన్నీ ఈనెల 25న ఉదయం ఆరు గంటల నుంచి 26 మధ్యాహ్నం 2 గంటల వరకూ మూసివేస్తారని తెలిపింది.