ఇక్కడ పుట్టినందుకు సిగ్గుపడుతున్నా! | Madras High Court judge sensational comment | Sakshi
Sakshi News home page

ఇక్కడ పుట్టినందుకు సిగ్గుపడుతున్నా!

Feb 16 2016 1:20 AM | Updated on Oct 8 2018 3:56 PM

ఇక్కడ పుట్టినందుకు సిగ్గుపడుతున్నా! - Sakshi

ఇక్కడ పుట్టినందుకు సిగ్గుపడుతున్నా!

‘దళితుడిడైనందుకు నన్ను వేధిస్తున్నారు. ఈ దేశంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. కులవ్యవస్థలేని ఏదైనా దేశానికి వెళ్లిపోవాలనుకుంటున్నాను’ అని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ సోమవారం

మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి సంచలన వ్యాఖ్య
♦ దళితుడినైనందుకే తనను వేధిస్తున్నారన్న న్యాయమూర్తి
♦ సుప్రీంకోర్టు బదిలీ ఉత్తర్వులను ఖాతరు చేయని వైనం
♦ సుమోటోగా బదిలీ ఉత్తర్వులపై స్టే
 
 న్యూఢిల్లీ: ‘దళితుడిడైనందుకు నన్ను వేధిస్తున్నారు. ఈ దేశంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. కులవ్యవస్థలేని ఏదైనా దేశానికి వెళ్లిపోవాలనుకుంటున్నాను’ అని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పదుడిగా పేరుబడ్డ జస్టిస్ కర్ణన్ క్రమశిక్షణా రాహిత్యంపై పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొంతకాలంగా ఆయనకు మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కౌల్‌కు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. తనను హైకోర్టు చీఫ్ జస్టిస్ వేధిస్తున్నారని, కించపరుస్తున్నారని జస్టిస్ కర్ణణ్ ఆయనపై ఆరోపణలు చేశారు.

కాగా, వివిధ ఆరోపణల నేపథ్యంలో గతవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని న్యాయమూర్తుల బృందం జస్టిస్ కర్ణన్‌ను కోల్‌కతా హైకోర్టుకు బదిలీ చేసింది. అయితే దీనిపై కూడా ఆయన విభేదించారు. ఈ ఉత్తర్వులపై పోరాడుతానని అన్నారు. తన విధుల్లో జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినే ధిక్కరించారు. భారత ప్రధాన న్యాయమూర్తి తనను బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై, తన పరిధిని దాటి తనంతట తానే సోమవారం స్టే ఇచ్చుకున్నారు. ఈ స్టేను నిలిపివేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. మరో పక్క జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు ఎలాంటి పని అప్పగించవద్దని సుప్రీంకోర్టు సోమవారం మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచించింది. 

కోల్‌కతా హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ కర్ణన్, నిబంధనలకు విరుద్ధంగా సుప్రీంకోర్టు బదిలీ ఉత్తర్వులపై సుమోటోగా స్టే ఇచ్చుకోవడం వివాదంగా మారింది. ఈ వ్యవహారంపై మద్రాసు హైకోర్టు రిజిస్ట్రార్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జేఎస్ కేహర్, జస్టిస్ భానుమతిలతో కూడిన సుప్రీం ధర్మాసనం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణన్‌ను విధులకు దూరంగా ఉంచాలని రిజిస్ట్రార్  పిటిషన్‌లో కోరారు. తమ ఉత్తర్వుల ప్రతిని జస్టిస్ కర్ణన్‌కు అందజేయాలని సుప్రీం ధర్మాసనం, హైకోర్టు రిజిస్ట్రార్‌కు సూచించింది. ఈ వ్యవహారంలో అవసరమనుకుంటే జస్టిస్ కర్ణన్ తమ ముందు హాజరుకావచ్చని, అయితే తన స్వంత ఖర్చులతోనే ఆయన సుప్రీంకోర్టుకు రావాలని ధర్మాసనం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement