కోలీకి ఉరిశిక్ష నిలిపివేత | Koli gets reprieve at the eleventh hour | Sakshi
Sakshi News home page

కోలీకి ఉరిశిక్ష నిలిపివేత

Sep 9 2014 1:47 AM | Updated on Sep 2 2017 1:04 PM

కోలీకి ఉరిశిక్ష నిలిపివేత

కోలీకి ఉరిశిక్ష నిలిపివేత

నిఠారీ వరుస హత్యల దోషి సురేందర్ కోలీ ఉరిశిక్ష అమలును సుప్రీంకోర్టు వారం పాటు నిలిపేసింది.

నిఠారీ హత్యల కేసులో దోషికి వారం పాటు ఊరట
 
న్యూఢిల్లీ: నిఠారీ వరుస హత్యల  దోషి సురేందర్ కోలీ ఉరిశిక్ష అమలును సుప్రీంకోర్టు వారం పాటు నిలిపేసింది. ఈ మేరకు జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ ఏఆర్ దవేతో కూడిన ధర్మాసనం సోమవారం తెల్లవారుజామున ఉత్తర్వులిచ్చింది. దీనికి సంబంధించిన పిటిషన్‌ను అర్ధరాత్రి పరిశీలించిన ధర్మాసనం ఆ వెంటనే .. స్టే విధించినట్లు కోర్టు అధికారులు తెలిపారు. మీరట్ జైలులో కట్టుదిట్టమైన భద్రత గల బ్యారక్‌లో ఉన్న 42 ఏళ్ల  కోలీని సోమవారం ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాల్సి ఉంది. అయితే అందుకు కొద్ది గంటల ముందే కోర్టు ఆదేశాలు అందడంతో జైలు వర్గాలు శిక్ష అమలును నిలిపేశాయి.

సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ నేతృత్వంలోని లాయర్ల బృందం  కోలీ తరఫున తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శిక్ష అమలుపై స్టే కోరుతూ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను జూలైలో కోర్టు కొట్టేయడం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోలీ లాయర్లు రివ్యూ పిటిషన్ వేశారు. ఖైదీల రివ్యూ పిటిషన్‌పై బహిరంగ విచారణ జరపాలని ఈ నెల 2న సుప్రీం ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ.. అప్పటివరకు ఉరి అమలును నిలిపేయాలన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. శిక్ష అమలుపై స్టే విధించింది. సోమవారం తెల్లవారుజామున 3.45 గంటలకు ఫ్యాక్స్ ద్వారా కోర్టు ఆదేశాలను మీరట్ జైలుకు పంపారు. దీన్ని అందుకున్నట్లు ఉదయం 4.30 గంటలకు జైలు వర్గాలు ధ్రువీకరించాయి. దీంతో శిక్ష అమలును అధికారులు నిలిపేసినట్లు పేర్కొన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement