మాల్యా ఒక మర్డరర్‌..!!

Kingfisher Employees Write Letter To PM Modi Accusing Vijay Mallya - Sakshi

మోదీ, సుష్మా స్వరాజ్‌కు కింగ్‌ఫిషర్‌ ఉద్యోగుల బహిరంగ లేఖ

సాక్షి, న్యూఢిల్లీ : జీతాలు చెల్లించకుండా హింసపెట్టిన విజయ్‌ మాల్యాపై కింగ్‌ఫిషర్‌ ఉద్యోగులు మండిపడుతున్నారు. సకాలంలో జీతాలు చెల్లించక ఇబ్బంది పెట్టడం లండన్‌లో నేరంగా పరిగణిస్తారనీ, ఇక్కడ కూడా అలాంటి ఘటనే జరిగిందని అంటున్నారు. నెలలుగా జీతాలు చెల్లించక పోవడంతో తీవ్ర మనోవేదనకు గురయిన ఒక ఉద్యోగి భార్య ఆత్మహత్య చేసుకుందని వారు ఆరోపించారు. మాల్యాను ఈ కారణంతోనైనా స్వదేశానికి తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ, విదేశీ వ్యవహరాల మంత్రి సుష్మాస్వరాజ్‌కు బహిరంగ లేఖ రాశారు. నేరస్తుడు, ఎగవేతదారుడైన విజయ్‌ మాల్యాను వెంటనే విదేశాల నుంచి రప్పించి నేర విచారణ చేపట్టాలని కోరారు.

‘మీ విదేశాంగ విధానాలు బాగానే ఉన్నాయి. మీ నాయకత్వంలో దేశం పురోగమిస్తోంద’ని మోదీ పాలనపై వారు ప్రశంసలు కురిపించారు. అయితే మాల్యా లాంటి చీడ పురుగులతో దేశానికీ, మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని అన్నారు. వేల కోట్ల రూపాయల ఎగవేతలకు పాల్పడ్డ మాల్యా వల్ల తమ బతుకులు బజారున పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తన వెనక బడా నేతలున్నానీ, బ్యాంకులు అరిచి గీపెట్టినా 5 శాతానికి మించి తన నుంచి రాబట్టలేరని మాల్యా ఒక కంపెనీ సమావేశంలో చెప్పినట్టు వారు ఆరోపిస్తున్నారు. ఇంతటి భారీ కుంభకోణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవడంలో వ్యవస్థ విఫలమవడం శోచనీయమన్నారు.

వేల కోట్ల రూపాయలకు ఎగనామం పెడుతున్న వారిని వదిలిపెట్టి ఉద్యోగాలు చేసుకునే వారిపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి పెట్టడం సబబు కాదని అన్నారు. జీతాలు రాక సతమతమవుతున్న తమకు ఇన్‌కం ట్యాక్స్‌ నోటీసులు వస్తున్నాయని వాపోయారు. కాగా, బ్యాంకు రుణాల పేరుతో మాల్యాకు చెందిన లిక్కర్‌ సంస్థల నుంచి విదేశాల్లో పెట్టుబడులకు, ఐపీఎల్‌ ఫ్రాంచైజీ కొనుగోళ్లకు 3700 కోట్లు మళ్లించారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌  సోమవారం కేసు నమోదు చేసింది. ఆ మరునాడే ఈ లేఖ వెలువడడం గమనార్హం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top