గోల్డ్‌ స్మగ్లింగ్‌: ఎవరీ స్వప్న సురేశ్‌? 

Kerala Gold Smuggling : Who is Swapna Suresh - Sakshi

తిరువనంతపురం : గోల్డ్‌ స్మగ్లింగ్‌ వ్యవహారం కేరళలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సీఎం కార్యాలయం ప్రమేయం ఉందనే ఆరోపణల వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం శివశంకర్‌ను తొలగించారు. మరోవైపు ఈ కేసులో స్వప్న సురేశ్‌ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కేరళ సీఎం కార్యాలయం వ్యవహారాలు తెలిసినవారికి స్వప్న సురేశ్‌ పేరు సుపరిచతమే. రాష్ట్ర ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పరిధిలోని స్పేస్‌ పార్క్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌గా ఉన్న స్వప్న బంగారం తరలింపులో కీలకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. విజయన్‌తో కలిసి స్వప్న దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. దీంతో స్వప్న ఎవరనేది ప్రస్తుతం హాట్‌ టాఫిక్‌గా మారింది.

కేరళకు చెందిన స్వప్న తండ్రి అబుదాబిలో స్థిరపడ్డారు. దీంతో అక్కడే జన్మించిన స్వప్న చిన్నప్పటి నుంచి విషయ పరిజ్ఞానం పెంచుకోవడంలో చురుకుగా ఉండేవారు. అబుదాబిలోనే చదువుకున్న స్వప్న.. అక్కడే విమానాశ్రయంలో ఉద్యోగం సంపాదించారు. అక్కడ ప్రయాణికుల సేవా విభాగం గురించి క్లుప్తంగా తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇండియా వచ్చిన స్వప్న.. రెండేళ్లపాటు ఒక ట్రావెల్‌ ఏజెన్సీలో పనిచేశారు. ఆ తర్వాత 2013లో తిరునంతపురం ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్‌ ఇండియా సాట్స్‌లో ఉద్యోగం పొందారు. అయితే అక్కడ ఒక అధికారిని తప్పుడు కేసులో ఇరికించడం కోసం నకిలీ పత్రాలు సమర్పించడంతో స్వప్నపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈ కేసు విచారణకు కూడా స్వప్న సహకరించలేదని సమాచారం. ఎట్టకేలకు స్వప్నను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆమెను విడుదల చేయాలని పైనుంచి పెద్ద ఎత్తున ఒత్తిడిలు వచ్చినట్టు చెబుతారు. (చదవండి : కేరళ రాజకీయాల్లో గోల్డ్‌ స్మగ్లింగ్‌ ప్రకంపనలు)

ఎయిర్‌ ఇండియా ఉద్యోగం మానేసిన తర్వాత.. యూఏఈ కాన్సులేట్‌లో ఒక కీలక పదవిలో నియమితులయ్యారు. అక్కడే ఆమె పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, కేరళ దౌత్య వేత్తలతో పరిచయాలు పెంచుకున్నారు. అరబిక్‌తో పాటు పలు భాషలపై పట్టున్న స్వప్నకు ఇది చాలా సులువుగా సాధ్యమైంది. అయితే స్వప్న అనేక అవకతవకలకు పాల్పడటంతో ఆమెను ఆ పదవి నుంచి తొలగించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పడిన పరిచయాలతో స్వప్న కేరళ ఐటీ విభాగంలో ఉద్యోగం సంపాదించారు. అలా సీఎంఓలోని కొందరితో పరిచయాలు పెంచుకున్నారు. ఈ క్రమంలోనే తనకున్న పరిచయాలను అసరాగా చేసుకుని బంగారం అక్రమ తరలింపుకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో నిందితుడైన శివశంకర్‌కు స్వప్నతో సత్సంబంధాలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ప్రస్తుతం స్వప్న మాత్రం పరారీలో ఉన్నారు. ఆమెను విచారిస్తే తప్ప ఈ గోల్డ్‌ స్మగ్లింగ్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. (చదవండి : గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు : ప్రిన్సిపల్‌ కార్యదర్శిపై వేటు)

అసలేం జరిగింది..
తిరువనంతపురం ఎయిర్ పోర్టులో సోమవారం పెద్ద మొత్తంలో బంగారం పట్టుపడింది. దౌత్య మార్గంలో తరలిన రూ. 15 కోట్ల విలువైన 30 కిలోల బంగారం విమానాశ్రయంలో పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి కేరళలో యూఏఈ కాన్సులేట్‌లో పనిచేసే ఓ మాజీ ఉద్యోగిని కస్టమ్స్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. అతన్ని విచారించగా.. ఇందులో ఐటీ విభాగంలో పనిచేసే స్వప్న సురేశ్‌ హస్తం ఉన్నట్టు వెల్లడించాడు. దీంతో గోల్డ్‌ స్మగ్లింగ్‌కు సంబంధించి స్వప్న పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా,  ఈ ఘటనకు రెండు రోజుల కిందటే ఆమెను కేరళ ఐటీ శాఖ నుంచి తొలగించారు. ఇక, ఫ్యామిలీ విషయానికి వస్తే.. భర్త నుంచి విడాకులు తీసుకున్న స్వప్నకు ఒక కుతూరు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top