బీజేపీకి ఓటమికి కారణం ఇదే..

JDU Blames Petrol, Diesel Price Rise For BJPs Debacle In Lok Sabha, Assembly Bypolls - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నాలుగు లోక్‌సభ, పది అసెంబ్లీ స్ధానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలపై మిత్రపక్షం జేడీయూ స్పందించింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల అసాధారణ పెంపు ఫలితంగానే ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిందని విశ్లేషించింది. వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలే బీజేపీ ఓటమికి కారణమని, దేశవ్యాప్తంగా పెట్రో ధరల పెంపుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని జేడీయూ సీనియర్‌ నేత కేసీ త్యాగి పేర్కొన్నారు. తక్షణమే పెట్రో ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

బిహార్‌లోని జోకిహాట్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఆర్‌జేడీ అభ్యర్థి సర్ఫరాజ్‌ ఆలం జేడీయూ అభ్యర్థి ముర్షీద్‌ ఆలంపై 40,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన నేపథ్యంలో జేడీయూ నేత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరోవైపు జేడీయూ పొందిన ఓట్లు తమ ఆధిక్యం కంటే తక్కువని ఆర్‌జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ పేర్కొన్నారు.

బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ యూటర్న్‌ తీసుకోవడంపై బిహార్‌ ప్రజలు కసితీర్చుకుంటున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన నాలుగు లోక్‌సభ,పది అసెంబ్లీ స్ధానాల ఉప ఎన్నికల్లో విపక్షాల చేతిలో బీజేపీకి భంగపాటు ఎదురైంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top