‘ఢిల్లీకి వచ్చి పెద్ద తప్పు చేశాను’

Jamia Student Said A Mistake Coming Delhi Over Police Lathi Charge - Sakshi

జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం న్యాయ విద్యార్థి

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి వచ్చి చాలా పెద్ద తప్పు చేశానని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో న్యాయవిద్యను అభ్యసిస్తున్న విద్యార్థి మిన్హాజుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 15న జామియా యూనివర్సిటీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనల్లో పోలీసులు విచక్షణరహితంగా విద్యార్థులపై లాఠీఛార్జి చేసిన విషయం తెలిసిందే. ఈ పోలీసుల దాడిలో మిన్హాజుద్దీన్ కంటికి తీవ్రంగా గాయం కావటంతో పాక్షికంగా చూపు కోల్పోయారు. లైబ్రరీలో చదువుకుంటున్న సమయంలో అకారణంగా పోలీసులు తనపై లాఠీచార్జ్‌ చేశారని తెలిపారు. నిరసనలు ఏడో గేటు వద్ద జరుగుతుంటే పోలీసులు లైబ్రరీలోకి చొరబడి దాడి చేశారని పేర్కొన్నారు.  తాను అసలు నిరసన కార్యక్రమంలో పాల్గొనలేదని మిన్హాజుద్దీన్ వెల్లడించారు.

తనకు శాంతి భద్రతలపై పూర్తి నమ్మకం ఉందని.. ‘నేను చేసిన నేరం ఏంటి’ అని మిన్హాజుద్దీన్ సూటిగా ప్రశ్నించారు. పోలీసుల లాఠీచార్జ్‌లో తన కంటికి గాయం అయిందని దీంతో మరో కంటికి కూడా ఇన్ఫెక్షన్ సోకుతుందని వైద్యులు చెప్పినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ ఘటనతో నాకు చాలా భయంగా ఉంది. అలాగే ఇకనుంచి లైబ్రరీలో చదుకోమని ఏ విద్యార్థికి నేను చెప్పలేను. ఆ భయంతో నేను లైబ్రరీలోకి చదుకోవడానికి వెళ్లలేను. విశ్వవిద్యాలయంలో భద్రత లేదు. ఈ ఘటనతో నా తల్లిదండ్రులు బిహార్‌కి వచ్చేయాలని కోరుతున్నారు’ అని మిన్హాజుద్దీన్‌ తెలిపారు. తాను న్యాయ విద్యను అభ్యసించి, శిక్షణ తీసుకునేందుకు ఢిల్లీకి వచ్చినట్లు తెలిపారు. అది పూర్తైన తర్వాతే బిహార్‌కి వెళ్తానని... అయితే. ఈ ఘటనతో తాను ఎందుకు ఢిల్లీకి వచ్చానా? అని బాధ పడుతున్నానని తెలిపారు. ఎందుకో ఢిల్లీని సురక్షితమైన నగరంగా తాను భావించటం లేదని.. ఇక్కడికి వచ్చి పెద్ద తప్పుచేశానని  మిన్హాజుద్దీన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top