సీఎంలు జబ్బు పడితే ఇక అంతేనా!

India Cannot Afford Ailing CMs - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పరీకర్‌ మొదటిసారి అనారోగ్యానికి గురై అప్పుడే ఏడు నెలలు గడచి పోయాయి. ఆయన మొదటి సారి ఫిబ్రవరిలో అనారోగ్యానికి గురైనప్పటి నుంచి సుదీర్ఘ కాలం పాటు ఇటు ముంబై, అటు అమెరికాలో వైద్య చికిత్సలు చేయించుకుంటున్నారు.

ఈ క్రమంలో సోమవారం మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. క్లోమగ్రంథి క్యాన్సర్‌తో బాధ పడుతున్న మనోహర్‌ పరీకర్‌ చికిత్స కోసం గత మార్చి నెలలో అమెరికా వెళ్లారు. జూన్‌ నెలలో తిరిగొచ్చారు. ఆగస్టు 10న మరోసారి అమెరికా వెళ్లి ఆగస్టు 22న తిరిగొచ్చారు. మళ్లీ చెకప్‌ కోసమని ఆగస్టు 30న అమెరికా వెళ్లారు. సెప్టెంబర్‌ 6న తిరిగొచ్చారు. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 13న పరీకర్‌ స్థానిక ఆస్పత్రిలో చేరారు. ఇప్పుడు ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలా మాటిమాటికీ ముఖ్యమంత్రి మనోహర్‌ స్థానికంగా ఉండకుండా.. చికిత్స కోసం వెళ్తుండటంతో రాష్ట్రంలో పాలనా వ్యవస్థ పూర్తిగా స్థంభించి పోయిందని ఆరోపిస్తూ ప్రభుత్వం ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్‌ పార్టీ కోరింది.

ఎలాంటి భంగం కలగడం లేదు!!
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీకన్నా నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక పోవడం, నాలుగు సీట్లు తక్కువ వచ్చిన బీజేపీ ఇతర పార్టీల మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెల్సిందే. మనోహర్‌ పరీకర్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నప్పటికీ పాలనా వ్యవస్థకు ఎలాంటి భంగం కలగడం లేదని పాలకపక్ష బీజేపీ చెబుతోంది. పరీకర్‌ తాను నిర్వహిస్తున్న హోం, ఆర్థిక, పర్సనల్, సాధారణ పాలన తదితర కీలక శాఖల ఫైళ్లను ఆస్పత్రికి తెప్పించుకొని ఎప్పటికప్పుడు పెండింగ్‌ అంశాలను క్లియర్‌ చేస్తున్నారని వాదిస్తోంది.

ఇలా జరగడం కొత్తేం కాదు..
కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న రాజకీయ నాయకులు ఇలా అనారోగ్యం పాలైనప్పుడు కూడా బాధ్యతలు నిర్వహించాల్సిన అవసరం ఉందా? నిర్వహిస్తే పాలనా వ్యవస్థ దెబ్బతినదా? అన్న ప్రశ్నలు ఇక్కడ ఉద్భవిస్తాయి. అయితే ఆస్పత్రి పాలైనపుడు కూడా పదవి వదులుకోకుండా బాధ్యతలు నిర్వహించడం ఇప్పుడే కొత్త కాదు. 2016లో, అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి దాదాపు 70 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆమె చనిపోయే వరకు కూడా యావత్‌ కేబినెట్‌ ఆమెతోపాటు ఆస్పత్రిలోనే ఉండి పోయింది. అప్పుడు కూడా పాలనా వ్యవస్థ స్తంభించి పోయినట్లు ప్రతిపక్షం నుంచి ఆరోపణలు వచ్చాయి.

1980వ దశకంలో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లి కొన్ని నెలలపాటు అక్కడే ఉండిపోయారు. ఆయన అక్కడ అస్పత్రి పడకపై ఉండే ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. కేబినెట్‌ తీసుకునే నిర్ణయాలన్నింటికీ మంత్రులంతా సమష్టి బాధ్యత వహించాల్సి ఉంటుంది కనుక ముఖ్యమంత్రి దూరంగా ఉన్నంత మాత్రాన కొంపలేవి మునిగి పోకపోవచ్చు. కానీ భారత్‌ లాంటి ప్రజాస్వామిక దేశంలో నిర్ణయాల్లో జాప్యం జరగడం వల్ల పాలనా వ్యవస్థ మందగించి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

సమయం, ప్రజాధనం వృథా అవుతుంది కదా..
ముఖ్యమంత్రి అనే వ్యక్తి షిప్‌కు కెప్టెన్‌ లాంటి వ్యక్తి అన్న విషయం తెల్సిందే. ఇప్పుడు ఢిల్లీలో చికిత్స పొందుతున్న మనోహర్‌ పరీకర్‌ తన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అన్ని ఫైళ్లను తెప్పించుకొని ఎప్పటికప్పుడు నిర్ణయాలను తీసుకుంటున్నారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. గోవా నుంచి ఈ ఫైళ్లను ఎప్పటికప్పుడు ఢిల్లీకి తీసుకెళ్లాలంటే ఎంత సమయం వృథా అవుతుందో, సమయం ఆదా కోసం విమానంలో తీసుకెళితే ఎంత ప్రజా సొమ్ము వృథా అవుతుందో ఎవరు ఆలోచించాలి?

చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది..
ఇలాంటి సమయాల్లో ఆస్పత్రుల్లో చేరిన ముఖ్యమంత్రులు తమ పదవులకు తాత్కాలికంగా రాజీనామా చేసి, ఆ బాధ్యతలను ఇతరులకు అప్పగించవచ్చు. కోలుకున్నాక ఆ బాధ్యతలను తిరిగి తీసుకోవచ్చు. అయితే ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంలో పార్టీ నాయకుల మధ్య పోటీ పెరిగి కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతాయని, లేదా అలా తాత్కాలికంగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తే చుట్టున్న వారిని తనవైపునకు తిప్పుకొని అసలు ముఖ్యమంత్రికే ఎసరు పెట్టవచ్చన్నది పార్టీల భయం. కానీ ఎప్పటికైనా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిందే. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నియామకానికి సంబంధించి పార్లమెంట్‌ ద్వారా చట్టమైన తీసుకురావాలి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top