పోయెస్‌ గార్డెన్‌ వద్ద టెన్షన్‌ : జయ గదులు తెరవొద్దు!

I-T Dept Searches Jayalalithaa's Poes Garden : Sasi group protest - Sakshi

వేదనిలయంలో ఐటీ, రెవెన్యూ అధికారుల పరిశీలన

జయ నివసించిన గదులు తెరవొద్దంటూ శశి వర్గీయుల ఆందోళన

భారీగా మోహరించిన పోలీసులు.. ఉద్రిక్తత..

సాక్షి, చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయెస్‌ గార్డెన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెద్ద సంఖ్యలో ఐటీ, రెవెన్యూ అధికారులు శనివారం ఉదయమే వేదనిలయానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. ఈ విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న శశికళ వర్గీయులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. పోయెస్‌ గార్డెన్‌ పరిసర ప్రాంతాలను స్వాధీనంలోకి తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా 5 బెటాలియన్ల అదనపు బలగాలను మోహరింపజేశారు.

ఆ రెండు గదులే కీలకం : విశాలమైన వేదనిలయం భవంతిని జయ స్మారక కేంద్రంగా మార్చాలని తమిళనాడు ప్రభుత్వం ఇదివరకే తీర్మానించింది. పొంగల్‌(సంక్రాంతి)లోపే ఆ కేంద్రాన్ని ప్రారంభించాలనుకున్న సీఎం పళని.. ఆ మేరకు చేయవలసిన పనుల బాధ్యతను చెన్నై కలెక్టర్‌కు అప్పగించారు. అయితే, జయ పర్సనల్‌ గదులు రెండింటి విషయంలో కొంత అయోమయం నెలకొంది. ఎందుకంటే.. గతంలో ఐటీ శాఖ వేదనిలయంలో సోదాలు నిర్వహించినప్పుడు ఆ రెండు గదులను సీజ్‌ చేశారు. వాటిని అలాగే వదిలేసి స్మారక కేంద్రంగా మార్చడం దాదాపు అసాధ్యం. కాబట్టే ఆ గదులను తెరిచే విషయమై ఐటీ, రాష్ట్ర రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ వారు వేదనిలయానికి వచ్చారు.

జయ గదుల్ని తెరవొద్దు : సీజ్‌ చేసిన రెండు గదుల్ని తెరిచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారన్న విషయం తెలియగానే శశికళ వర్గంలో కలకలం మొదలైంది. పెద్ద సంఖ్యలో పోయెస్‌ గార్డెన్‌ వద్దకు చేరుకున్న శశి వర్గీయులు.. ‘అమ్మ గదులను తెరవొద్దు’ అంటూ నినాదాలు చేశారు. ప్రజల దృష్టిలో జయ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకే పళని-పన్నీర్‌లు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. వేదనిలయాన్ని అమ్మ స్మారకంగా మార్చినా, అమ్మ నివసించిన గదులను మాత్రం తెరవకుండా అలానే వదిలేయాలని శశికళ వర్గం మొదటి నుంచీ వాదిస్తోంది.

ఇంతకీ ఏమున్నాయక్కడ?: జయలలిత బతికున్నప్పుడు వినియోగించిన ఆ రెండు గదుల్లో పలు కీలక డాక్యుమెంట్లు, పెన్‌డ్రైవ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర విలువైన వస్తువులు ఉన్నట్లు సమాచారం. గతంలో ఐటీ దాడుల అనంతరం ఆ రెండు గదులను సీజ్‌ చేశారు. తాజా సమాచారం ప్రకారం.. ఆ గదుల్లోని అన్ని వస్తువులను తమిళనాడు ప్రభుత్వానికే స్వాధీనం చేయాలని ఐటీ శాఖ భావిస్తోంది. కానీ శశి వర్గం మాత్రం అసలు గదులను తెరవనే తెరవొద్దని ఆందోళన చేస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top