
ఈ ఇంగ్లిష్ టీచర్ సమ్‌థింగ్ స్పెషల్!
పిల్లలకు మంచి సౌకర్యాలు ఉండాలని అభిలషించిన టీచర్.. తన నగలు అమ్మి మరీ ఆ క్లాస్‌రూంను తీర్చిదిద్దారు.
చెన్నై: మావి ఇంటర్నేషనల్ స్కూళ్లు అని ఊదరగొట్టే కార్పోరేట్ విద్యాసంస్థలను తలదన్నేలా ఓ ప్రభుత్వ పాఠశాలలోని తరగతిగది రూపుదిద్దుకుంది. క్లాస్‌రూం అంటే ఇలా ఉండాలి అనిపించేలా.. ఇంటరాక్టీవ్ స్మార్ట్‌బోర్డు, సౌకర్యవంతమైన ఫర్నీచర్, పిల్లలకు నచ్చేలా ఉన్న రంగురంగుల పెయింటింగ్‌లు, రిఫరెన్స్ పుస్తకాలు ఇవన్నీ తమిళనాడులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. అక్కడ పనిచేస్తున్న ఓ ఇంగ్లిష్ టీచర్‌కు తన వృత్తి పట్ల ఉన్న నిబద్ధతకు నిలువుటద్దం ఆ వసతులు. పిల్లలకు మంచి సౌకర్యాలు ఉండాలని అభిలషించిన ఆమె.. తన నగలు అమ్మి మరీ ఆ క్లాస్‌రూంను తీర్చిదిద్దారు.
విల్లుపురంలోని కందాడు ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులు అదృష్టవంతులు. ఎందుకంటే అక్కడ అన్నపూర్ణా మోహన్ అనే ఇంగ్లిష్ టీచర్ పనిచేస్తున్నారు. ఆ పాఠశాలలో పిల్లలు తడుముకోకుండా ఇంగ్లిష్ మాట్లాడటంలో ఆమె కృషి ఎనలేనిది. అయితే.. ఆమె అంతటితోనే తన బాధ్యత తీరిపోయిందని భావించలేదు. పిల్లలకు మంచి వసతులు ఉండాలని భావించారు. అందుకోసం సొంత ఖర్చులతో విద్యార్థులకు సౌకర్యాలు ఏర్పరిచారు.
విద్యార్థులలో ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంపొందించడానికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వలే తనకు కూడా సవాళ్లు ఎదురయ్యాయని తన అనుభవాల గురించి మీడియాతో మాట్లాడుతూ అన్నపూర్ణ వెల్లడించారు. మొదట పిల్లలతో ఇంగ్లిష్‌లో ఇంటరాక్ట్ అవుతుంటే వారు సరిగా స్పందించేవారు కాదని తెలిపారు. అయితే.. బోధనలో విద్యార్థులను మమేకం చేస్తూ.. స్కిట్‌లు తదితర పద్దతుల్లో పాఠాలను బోధించేదాన్నని గుర్తుచేశారు. తరువాత ఓసారి విద్యార్థుల ఇంగ్లిష్ సామర్థ్యాలను ఫేస్‌బుక్‌లో ఉంచగా.. మంచి స్పందన వచ్చిందని తెలిపారు. అనేక మంది ముందుకొచ్చి విద్యార్థులకు బహుమతులు పంపుతూ ప్రోత్సహించారని గుర్తుచేశారు.
ఇలా అందరూ స్పందిస్తున్న తీరే.. విద్యార్థులకు మంచి క్లాస్‌రూం అందించే దిశగా తనను ప్రోత్సహించిందని అన్నపూర్ణ తెలిపారు. ‘కొంతమంది విదేశీయులు కూడా విద్యార్థులను ప్రోత్సహించారు. దాంతో విద్యార్థులకు సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. తరగతి గదిని అన్ని వసతులతో తీర్చిదిద్దాలని భావించాను’ అన్నారు అన్నపూర్ణ. అందుకోసం అవసరమైన డబ్బును నగలు అమ్మి సమకూర్చుకున్నారు ఆమె. ‘ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా ప్రమాణాలు ప్రైవేటు పాఠశాలల్లో మాదిరిగా ఉండటం లేదని తల్లిదండ్రులు భావిస్తున్నారు. అందువల్ల వారు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా అందించే విద్యకోసం లక్షలాది రూపాయలను ప్రైవేట్‌లో వెచ్చిస్తున్నారు. అయితే.. కొంచెం కృషితో పేద విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించవచ్చు’ అని అంటున్నారు అన్నపూర్ణ.