రాట్నం తిప్పి.. నూలు వడికి | Donald Trump visit Sabarmati Ashram, try hands on charkha | Sakshi
Sakshi News home page

రాట్నం తిప్పి.. నూలు వడికి

Feb 25 2020 4:32 AM | Updated on Feb 25 2020 8:39 AM

Donald Trump visit Sabarmati Ashram, try hands on charkha - Sakshi

రాట్నం పనితీరును ట్రంప్‌ దంపతులకు వివరిస్తున్న మోదీ

అహ్మదాబాద్‌ : భారత్‌ పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌ సోమవారం అహ్మదాబాద్‌లో సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అంతకు కొద్ది నిముషాల ముందే ఆశ్రమానికి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ట్రంప్‌ దంపతులకు ఆశ్రమం అంతా తిప్పి చూపించి దాని విశిష్టతను తెలియజేశారు. భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో ఈ ఆశ్రమంలో గాంధీజీ, ఆయన భార్య కస్తూర్బా 1917–1930 మధ్య కాలంలో నివసించారు. వారిద్దరూ నివసించిన గది హృదయ్‌ కుంజ్‌ లోపలికి ట్రంప్‌ దంపతుల్ని తీసుకువెళ్లి చూపించారు. భారత స్వాతంత్య్ర సంగ్రామం గురించి, గాంధీజీ పోరాట స్ఫూర్తి గురించి వివరించారు. ఆశ్రమంలో ఉన్న చరఖాను ట్రంప్, మెలానియా కూడా తిప్పుతూ, నూలు వడకడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఆశ్రమ నిర్వాహకులు రాట్నాన్ని ఎలా తిప్పుతూ నూలు వడకాలో వారికి వివరించి చెప్పారు. ట్రంప్‌ చరఖా తిప్పుతున్నప్పుడు మెలానియా ఆయనకు సహకరించారు.

మహాత్ముడిని ప్రస్తావించని ట్రంప్‌  
దాదాపు 15 నిముషాల సేపు ఆశ్రమంలో గడిపి తిరిగి వెనక్కి వెళుతున్నప్పుడు సందర్శకుల పుస్తకంలో ట్రంప్‌ ‘‘నా గొప్ప స్నేహితుడైన ప్రధానమంత్రి మోదీ – అద్భుతమైన ఈ పర్యటనకు ధన్యవాదాలు’’అని తన సందేశాన్ని రాశారు. ట్రంప్, మెలానియాలు ఇద్దరూ సంతకాలు చేశారు. గాంధీజీ బోధనల గురించి కానీ, ఆయన ప్రపంచానికి అందించిన స్ఫూర్తి గురించి నామ మాత్రంగా కూడా ట్రంప్‌ ప్రస్తావించలేదు. దీనిపై ట్విటర్‌లో తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. సబర్మతి ఆశ్రమానికి వెళ్లి కూడా గాంధీ గురించి రెండు ముక్కలు రాయకపోవడమేంటని నెటిజన్లు కామెంట్లు చేశారు. 2015లో బరాక్‌ ఒబామా ఢిల్లీ రాజ్‌ఘాట్‌ను సందర్శించినప్పుడు ‘‘డాక్టర్‌ మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ చెప్పిన మాటలు ఇప్పటికీ వాస్తవం. గాంధీ స్ఫూర్తి భారత్‌లో అణువణువు జీర్ణించుకొని ఉంది. అది ప్రపంచానికి భారత్‌ ఇచ్చిన గొప్ప బ హుమతి’’అని రాయడంతో పోలుస్తూ కామెంట్లు ఉంచారు. సబర్మతి ఆశ్రమంలో ట్రంప్‌ అసలు రూపం తెలిసిందని కాంగ్రెస్‌ నేత మనీష్‌ తివారీ పోస్టు పెడితే, త్రిపుర మాజీ ఎమ్మెల్యే తపస్‌ దే మోదీపై తన ప్రేమను ట్రంప్‌ ఒలకపోశారని విమర్శించారు.

అల్పాహారం తీసుకోని ట్రంప్‌ దంపతులు
సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన ట్రంప్‌ దంపతులకు గుజరాతీ రుచులతో కూడిన పూర్తిగా శాకాహారంతో హై టీ ఏర్పాటు చేశారు. కానీ వారిద్దరూ వాటిని తీసుకోలేదని ఆశ్రమ ట్రస్టీ వెల్లడించారు. ట్రంప్‌ కోసం ప్రత్యేకంగా హోటల్‌ ఫార్చూన్‌ ల్యాండ్‌మార్క్‌కు చెందిన చెఫ్‌ సురేష్‌ ఖన్నా ఆధ్వర్యంలో తయారు చేసిన గుజరాతీ స్పెషల్‌ ఖమాన్, బ్రాకొలిన్‌–కార్న్‌ బటన్‌ సమోసా, మల్టీ గ్రెయిన్‌ కుకీస్, కాజూ కత్లీ  
యాపిల్‌ పేస్ట్రీ, తాజా పండ్లు, గుజరాతీ అల్లం టీ ఉంచారు. అయినా వాటినేమీ వాళ్లు రుచి చూడలేదు. ట్రంప్‌ మాంసాహార ప్రియుడు. కానీ సబర్మతి ఆశ్రమంలో మాంసం నిషిద్ధం కావడంతో శాకాహారంతో తయారు చేసిన స్నాక్స్‌ ఉంచారు.
 
గాంధీజీ మూడు కోతుల బహుమానం  
 చెడు వినకు , చెడు కనకు, చెడు మాట్లాడకు అన్న గాంధీజీ బోధనని చాటి చెప్పే మూడు కోతుల బొమ్మల్ని ట్రంప్, మెలానియాలకు మోదీ కానుకగా ఇచ్చారు. ఇక ఆశ్రమం తరఫున ట్రస్టీ కార్తికేయ సారాభాయ్‌ ట్రంప్‌ దంపతులకు మహాత్మాగాంధీ ఆటోబయోగ్రఫీ పుస్తకం, గాంధీజీ, చరఖా పెన్సిల్‌ డ్రాయింగ్‌లను బహూకరించారు. అంతకు ముందు ఆశ్రమం ట్రస్టీ కార్తికేయ సారాభాయ్‌ ట్రంప్, మెలానియాలకు ఖద్దరు శాలువా కప్పి స్వాగతం పలికారు. ట్రంప్‌ సందర్శన పూర్తయిన తర్వాత కార్తికేయ విలేకరులతో మాట్లాడుతూ సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్‌ చాలా ఎంజాయ్‌ చేశారని చెప్పారు. ఆశ్రమంలోకి అడుగుపెట్టగానే ఎనలేని మనశ్శాంతి తనకు కలిగిందని, ఆ ఆశ్రమం ప్రాధాన్యత అర్థమైందని ట్రంప్‌ తనతో చెప్పారని కార్తికేయ వెల్లడించారు.  

మూడు కోతుల ప్రతిమతో బహూకరిస్తున్న మోదీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement